మీ ఓటు మరొకరు వేసి ఉంటే ఎం చేయాలో తెలుసా..?

  • ఓటరుకు రాజ్యాంగం అందించిన బ్రహ్మాస్త్రం సెక్షన్ 49 పి..!

ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం అనేది దేశ పౌరులందరికి రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది సామాన్యుడి చేతిలో ఉన్న శక్తివంతమైన అస్త్రం. మరి ఎన్నికల రోజున మీ ఓటుకు మీకు బదులుగా వేరొకరు వేసి ఉంటే ఎం చేయాలి..? చాలామంది ఇటువంటి అనుభవాన్ని చవిచూసే ఉంటారు. అటువంటి సమయాల్లో ఎం చేయాలో తెలియక చాలామంది అయోమయంతో పోలింగ్ కేంద్రాల నుండి వెనుదిరుగుతుంటారు. ఎవరైనా ఒక వ్యక్తి తనకు బదులుగా వేరొకరు తన ఓటును వేసిన సమయంలో టెండర్ ఓటు ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకోసం రాజ్యాంగంలో సెక్షన్ 49 పి ఓటర్లకు అందించిన బ్రహ్మాస్త్రంగా చెప్పుకోవచ్చు. గతంలో సైతం పలు ఎన్నికల్లో ఒక్క టెండర్ ఓటు నమోదైనా రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించడంతో టెండర్ ఓటుపై సర్వత్రా చర్చ జరిగింది. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ఈ టెండర్ ఓటు వేసే అవకాశం ఉండటంతో తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా మరోసారి టెండర్ ఓటు పై గ్రేటర్ లో చర్చ జరుగుతోంది.

అసలు టెండర్ ఓటు అంటే ఏమిటి…?
భారత ఎన్నికల సంఘం 1961లో తీసుకొచ్చిన సెక్షన్ 49పి ప్రకారం ఒక వ్యక్తి తన ఓటును మరొకరు వేస్తే తిరిగి ఎన్నికల్లో ఓటును పొందేందుకు కల్పించిన చట్టం ఇది. కోల్పోయిన ఓటును పొందాలనుకునేవారు తానే అసలు ఓటరునని ఎన్నికల అధికారి (సంబంధిత బూత్ ప్రిసైడింగ్ అధికారి) ముందు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓటరు గుర్తింపు కార్డు తో పాటు ఇతర ఆధారాలను సమర్పించి అధికారి వద్ద ఉండే 17(బి) ఫామ్ పూర్తి చేసి సంతకం చేసి అందజేయాలి. అపుడు అధికారి టెండర్ బ్యాలెట్ పేపరును సదరు ఓటరుకు అందజేస్తారు. టెండర్ బ్యాలెట్ పై ఓటు వేసి ప్రత్యేక కవరులో ఉంచి లెక్కింపు కేంద్రానికి పంపిస్తారు. అయితే ఎన్నికల ఫలితాల్లో తేడా భారీగా ఉన్నప్పుడు టెండర్ బ్యాలెట్ ను పరిగణలోకి తీసుకోరు. అభ్యర్థి విజయంపై దీనిపై ఆధారపడి ఉంటేనే లెక్కిస్తారు. పోలైన ఓట్లలో 0.1 శాతం టెండర్ ఓట్లు నమోదైతే ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

టెండర్ ఓటు తో పటు మరికొన్ని రకాల ప్రత్యేకమైన ఓట్లు ఉన్నాయి. అవి ఏంటంటే..

చాలెంజ్‌ ఓటు…
ఎవరైనా ఒక వ్యక్తి ఓటు వేయడానికి వెళ్లినప్పుడు అక్కడున్న పోలింగ్‌ ఏజెంట్‌ సదరు వ్యక్తి అసలైన ఓటరు కాదని అభ్యన్తరం చెప్పడాన్ని చాలెంజ్ ఓటు‌ అంటారు. అంటే ఇక్కడ పోలింగ్‌ ఏజెంట్‌ చాలెంజ్‌ చేస్తాడన్నమాట. అంటే ఈ చాలెంజ్‌లో ఓటువేయడానికి వచ్చిన వ్యక్తి తానే అసలైన ఓటరు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనం తగిన ఆధారాలు చూపాలి. ఎపిక్‌ కార్డు (ఓటరు గుర్తింపు కార్డు)లో ఉన్న పేరు, లింగ, వయసు, బంధుత్వ వివరాలు, ఎపిక్‌ సంఖ్య సరిగా ఉన్నాయా లేదా అనేవి ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి పరిశీలిస్తాడు. అయినప్పటికీ ఏజెంట్‌ అభ్యంతర పెడితే అతని వద్ద నుంచి రెండు రూపాయల రుసుం వసూలు చేసి చాలెంజ్‌ ఓటు కింద రసీదు ఇస్తారు. అతని వివరాలు మరింతగా విచారిస్తారు. అందుకోసం స్థానికుల సహాయం తీసుకుంటారు. చాలెంజ్‌ తప్పు అయితే మాత్రం ఓటుకు అనుమతిస్తారు. ఏజెంట్‌ ఆరోపణ (చాలెంజ్‌) సరైనదైతే ఓటు నిరాకరిస్తారు. ఏజెంటుకు రెండు రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు. చాలెంజ్‌ను స్వీకరించ నిరాకరిస్తే పోలీసులకు అప్పజెబుతారు. ఈ వివరాలన్నింటినీ చాలెంజ్‌ ఓటు ఫారం-14లో నమోదు చేస్తారు.

పోస్టల్‌ బ్యాలెట్‌…
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వేసే ఓటునే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు అంటారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటరు 13 ఓటరు ధ్రువీకరణ పత్రం, 13బీ కవరు లోపల పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రం రెండు జత చేసి పంపిచాలి. అయితే ఇది ఎన్నికల పోలింగ్‌ తేదీ నాటికి రిటర్నింగ్‌ అధికారికి అందేలా పంపాలి. ఆ తేదీ తరువాత అందినా, పత్రాలపై ఓటరు సంతకాలు లేకపోయినా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లదు.

సర్వీసు ఓటు…
దేశ సైనికులు, పారామిలటరీ ఉద్యోగులకు ఇచ్చే ఓటు హక్కునే సర్వీసు ఓటు అంటారు. వీరికి స్వయంగా వచ్చి ఓటు వినియోగించుకునే అవకాశం ఉండదు. అందుకని వీరి తరుపున వీరి ప్రతినిధి ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీనినే ప్రాక్సీ ఓటింగు అంటారు. వీరు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

ప్రాక్సీ ఓటు…
ప్రత్యేక సర్వీసులైన ఇంటెలిజెన్స్‌, గూఢచారి సిబ్బందికి ఇచ్చే ఓటు హక్కునే ప్రాక్సీ ఓటింగ్‌ అంటారు. వారు స్థానికంగా లేనందున వారి తరుపున ఓటు వేసేందుకు ఒక ప్రతినిధిని ఎన్నికల సంఘం అనుమతిస్తుంది. అతడినే ప్రాక్సీ (ప్రతినిధి) ఓటరు అంటారు. ఇతను సాధారణ ఓటర్లలాగే ఓటు వేస్తాడు. మరొకరి తరపున ఓటు వేసిన సమయంలో ఇతడికి మధ్యవేలికి సిరాచుక్క పెడతారు. అతడు తన ఓటు వేసే సమయంలో చూపుడు వేలుకి సిరాచుక్క వేస్తారు. ఇతడు ఇలా ఒకరి తరుపున మాత్రమే ప్రాక్సీ ఓటు వేయగలడు.

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here