ఓటర్లందు పుణ్య ఓటర్లు వేరయా…!

ఢిల్లీ ఎన్నికలైనా గల్లీ ఎన్నికలైనా ఫలితాలను శాసించేది సామాన్య ఓటర్లే. ఓటర్ల మనోగతమే ఎన్నికల్లో విజేతలను నిర్ణయిస్తుంది. ప్రతీ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి నానా తంటాలు పడుతుంటాడు. అయినా ఓటరు నాడి కచ్చితంగా పసిగట్టడం అసాధ్యమైన పనే. అయితే ఓటర్లలో కొన్ని రకాలు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఒక్కో రకం ఓటర్ల సంఖ్య ఒక్కో రకంగా ఉంటుంది. వీరి తీరుపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇంతకీ ఆ ఓటర్లు ఎవరో చూద్దామా..!

కంపేరిటివ్ ఓటర్లు
వీరు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం కలిగి ఉండరు. రాజకీయాలను, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యక్తిత్వాలను, రాజకీయ పార్టీల తీరును బేరీజు వేసుకుని తదనుగుణంగా ఓటు వేస్తుంటారు. ఏ పార్టీ మంచి పాలన అందించింది, ఏ నాయకుడు వస్తే ఎలా సేవలు చేస్తాడో తెలుసుకుని ఆ సమాచారం ఆధారంగా సొంత నిర్ణయం తో ఓటు వేస్తారు. ఓటర్లలో ఉత్తమ ఓటర్లుగా వీరిని పేర్కొనవచ్చు.

ఇర్రెస్పాన్సిబుల్ ఓటర్లు:
వీరు కేవలం వారి వ్యక్తిగత పనుల నిమిత్తం ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుంటారు తప్ప ఎన్నికల్లో పాల్గొనరు. రాజకీయాలన్నా, ప్రభుత్వాలన్నా వీరికి పట్టదు. పోలింగ్ తేదీ వీరికి సెలవు దినం. చక్కగా కుటుంబ సమేతంగా సినిమాకో, పార్కుకో వెళ్లి కాలక్షేపం చేస్తారు. అర్బన్ ఏరియాల్లో వీరి సంఖ్య ఎక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది.

పార్టీ కమిటెడ్ ఓటర్లు
వీరు ఆ ప్రాంతంలోని ఎదో ఒక రాజకీయ పార్టీకి నిబద్దత కలిగి ఉంటారు. సదరు రాజకీయ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, ఆ పార్టీలోని ఎదో ఒక నాయకుడికి ఆకర్షితులై పార్టీ పై విపరీతమైన అభిమానం కలిగి ఉంటారు. పార్టీ గుర్తే తప్ప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారనేది వీరికి అనవసరం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరి మనసు మార్చడం అసాధ్యం.

కాండిడేట్ కమిటెడ్ ఓటర్లు
వీరు ఏదేని రాజకీయపార్టీలో ఒక నాయకుడికి నిబద్దులై ఉంటారు. ఆ రాజకీయ నేత చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల కారణంగా సదరు నేతపై అభిమానం కలిగి ఉంటారు. వీరి అభిమాన నేత ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీకి ఓటు వేయడం వీరి అలవాటు. వీరి నిర్ణయాన్ని కూడా మార్చడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి.

కాపీ క్యాట్ ఓటర్లు
వీరికి రాజకీయాలపై గానీ, రాజకీయ నాయకులపై గానీ పెద్దగా అవగాహన ఉండదు. ఇరుగు పొరుగు వారి మాటలను విని వారిని గుడ్డిగా అనుసరిస్తారు. ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో వీరికి సొంత అభిప్రాయమంటూ ఏమీ ఉండదు.

ఫ్రస్టేటెడ్ ఓటర్లు
గత ఎన్నికల్లో గెలిచి తమ సమస్యలను పట్టించుకోకుండా, పిర్యాదులు చేసినా స్పందించని నేతలపై ఈ రకపు ఓటర్లు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతుంటారు. ఎన్నికల సమయానికి వారి కోపాన్నంతా ప్రత్యర్థి పార్టీకి ఓటువేసి చల్లార్చుకుంటారు.

ఎన్నికల్లో డబ్బుతో ముడిపడి ఉన్న ఓటర్ల లో రకాలు కొందరు ఉన్నారు.. వారెవరో చూద్దాం

కమర్షియల్ ఓటర్లు
వీరికి ఎన్నికలు వస్తే పండగే. ఏ రాజకీయ పార్టీ/ నాయకుడు ఎక్కువ డబ్బులు/గిఫ్టులు ఇస్తే ఆ పార్టీకి/నాయకుడికి ఓటు వేయడం వీరి అలవాటు. ఒకరి కన్నా ఎక్కువ మంది డబ్బులు పంపిణీ చేస్తే ఎక్కువ ఇచ్చిన నాయకుడికే వీరు జై కొడతారు.

సమన్యాయపు ఓటర్లు
ఈ రకం ఓటర్లు ఓటు వేసేందుకు డబ్బులు తీసుకున్నా, తీసుకున్న మొత్తానికి న్యాయం చేయడం వీరి అలవాటు. ఒకే నాయకుడు డబ్బులు పంచితే అదే నేతకు విశ్వాసంగా ఓటు వేస్తారు. ఒకరి కన్నా ఎక్కువ మంది డబ్బులు అందజేస్తే తీసుకున్న మొత్తానికి అనుగుణంగా తమ ఇంట్లోని ఓట్లను విభజించి డబ్బులు పంచిన నాయకులందరికీ సమన్యాయం చేస్తారు.

గుంపులో గోవింద ఓటర్లు
వీరు రాజకీయాలను గమనిస్తూనే సమాజంలో జరిగే ప్రచారాలను నమ్మేస్తూ ఉంటారు. సొంతగా ఏ నాయకుడికీ వీరు కట్టుబడి ఉండకపోయినా ఎన్నికల్లో ఫలానా అభ్యర్థి గెలవబోతున్నాడు అని ప్రచారం జరిగితే అదే నాయకుడికి గుడ్డిగా ఓటు వేయడం వీరి పని. ఓడిపోయే అభ్యర్థులకు ఓటు వేస్తే తమ ఓటు వృధా అవుతుంది అనేది వీరి భావన.

వీరితో పాటు మరికొన్ని రకాల ఓటర్లు ఉన్నా ప్రధానంగా పై లక్షణాలు కలిగిన ఓటర్లను అధికంగా చూస్తూ ఉంటాం. మీకు తెలిసిన మరికొన్ని రకాల ఓటర్ల గురించి comments లో తెలపండి.

గమనిక : ఈ పోస్టు ఓటర్లలో చైతన్యం కలిగించడం తో పాటు కొన్ని అంశాలు సరదాగా రాయబడినవి. ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. దయచేసి గమనించగలరు.

Advertisement

1 COMMENT

  1. హ హ హ … బలే విశ్లేషణ బాగుంది కరెక్ట్ గా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here