నమస్తే శేరిలింగంపల్లి: డ‌్రైనేజీ సమస్య కారణంగా మురుగునీరు రోడ్డుపై పారుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులకు పలుమార్లు సమస్యను వివరించినా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలోగల రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్ వెనుక భూగర్భ డ్రైనేజీ లీకేజీల కారణంగా మురుగునీరు రోడ్లపై పారుతోంది. దీంతో తీవ్ర దుర్వాసనతో పాటు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.