శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ సోఫా వర్క్ షాపు దగ్ధమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలుఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని నల్లగండ్ల గుల్‌మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద హెచ్‌పీ పెట్రోల్ పంప్ ఎదురుగా జగదీష్ పాటిల్ అనే వ్యక్తి మహావీర్ సోఫా వర్క్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. మదీనాగూడలోని దీప్తిశ్రీనగర్‌లో ఉంటూ రోజూ షాపుకు వచ్చి వెళ్తుంటాడు. కాగా రోజూ రాత్రి 8 గంటల సమయంలో తన షాపును మూసేస్తాడు. ఈ క్రమంలోనే నవంబర్ 30వ తేదీన యథావిధిగా తన షాప్‌ను మూసేశాడు.
డిసెంబర్ 1 ఆదివారం కావడంతో షాపును తెరవలేదు. డిసెంబర్ 2వ తేదీ అర్థరాత్రి 12.10 గంటల సమయంలో పెట్రోల్ పంపులో పనిచేస్తున్న కొందరు జగదీష్‌కు ఫోన్ కాల్ చేశారు. అతని షాపు మంటల్లో దగ్ధమవుతుందని చెప్పారు. దీంతో వెంటనే అతను ఇంటి నుంచి షాపుకు చేరుకుని చుట్టు పక్కల వారి సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. కాగా ఈ ప్రమాదంలో షాపులో ఉన్న ఫర్నిచర్, మిషన్స్, కిటికీలు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.