- దేశంలో ఎక్కువగా నమోదవుతున్న ఫాటీ లివర్ వ్యాధి కేసులు
నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధి (NAFLD), ప్రజలలో సర్వసాధారణంగా పేర్కొనబడే ఫాటీ లివర్ వ్యాధి భారత దేశంలో నానాటికీ పెరుగుతుండడాన్ని గమనిస్తున్నాం. పలు గణాంకాల ప్రకారం ఈ వ్యాధి 9 నుండి 32 శాతం మంది భారత దేశ ప్రజలలో (ప్రాంతాన్ని బట్టి) కనిపిస్తుందని అంచనా. అందులోనూ ముఖ్యంగా ఊబకాయం, డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉన్న రోగులలో ఇది ఎక్కువగా ప్రబలుతోంది.
NAFLD లేదా నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధి అంటే ఏమిటి ?
NAFLD లేదా నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధి అనేది కాలేయంలో కొవ్వు పేరుకోవడం వలన ఏర్పడుతుంది. ఈ వ్యాధి రెండు రకాలుగా ఏర్పడుతుంది. అందులో మొదటిటి NAFLD లేదా నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధి. ఇది సాధారణంగా కొవ్వు పెరగడం కారణంగా వస్తుంది. కానీ ఎటువంటి నొప్పి, మంట ఉండదు. రెండవది NASH లేదా నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అనేది కొవ్వు పెరగడం వలన వచ్చి నొప్పి లేదా మంట లక్షణాలు కనిపిస్తాయి.
NAFLD లేదా నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధి
NAFLD లేదా నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధి సాధారణంగా ప్రాణాంతకంగా మారకపోయినా బరువు పెరగడం, ఊబకాయం ఎక్కువ కావడం వలన మన దేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాధి కారణంగా కాలేయం పని తీరులో ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతోపాటు ఎలాంటి లక్షణాలు కనిపించవు.
మరేదైనా కారణాల చేత రోగి జీర్ణాశయం స్కాన్ చేయించుకొన్న సందర్భాలలో ఈ వ్యాధిని సర్వ సాధారణంగా గుర్తించడం జరుగుతుంది. ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు. కాలేయంలో పెరిగిన కొవ్వును తగ్గించుకోవడానికి సదరు వ్యక్తి తన ఊబకాయం తగ్గించుకోవడానికి పాటించే బరువు తగ్గే వ్యాయామ ప్రక్రియలు చేయడం ద్వారానే ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు.
NASH లేదా నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్
NASH లేదా నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకునే సందర్భాలలో మంట లేదా వాపు ఏర్పడడం జరుగుతుంది. దీని కారణంగా కాలేయంలో గాయం ఏర్పడుతుంది. సర్వ సాధారణంగా ఈ పరిస్థితి ఎక్కువగా ఆల్కహాల్ సేవించిన వారిలో మనం చూడవచ్చు అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఆల్కహాల్ సేవించని వారిలో అంటే ఆల్కహాల్ కు దూరంగా ఉన్న వారిలో కూడా ఈ వ్యాధిని గమనించవచ్చు. ఇలాంటి స్థితి ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడిన వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు కూడా సర్వ సాధారణంగా బయటపడవు. అయితే వ్యాధి వచ్చిన వారిలో అలసట ఎక్కువగా ఉండడం, ఆరోగ్యం బాగా లేదని అనిపించడం, పొత్తి కడుపుపై భాగంలో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలను తరచుగా గమనిస్తూ ఉండవచ్చు.
NASH లేదా నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ వ్యాధిని ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకొన్నపుడు గుర్తిస్తూ ఉంటారు. దీనితోపాటు అల్ట్రా సౌండ్, ఫైబ్రో స్కాన్, సిటి స్కాన్ లేదా ఎంఆర్ఐ వంటి ఇతరత్రా పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధిని కచ్చితంగా గుర్తించే ప్రయత్నం చేస్తారు.
కాలేయానికి సంబంధించిన పలు సమస్యలు ఎక్కువగా ఆల్కహాల్ సేవించడంతోపాటు పలు ఇతర కారణాల వలన ఏర్పడుతుంటాయి. అయితే ఫాటీ లివర్ వ్యాధి రావడానికి ఎక్కువగా ఆల్కహాల్ సేవించడమే కారణం కాకపోవచ్చు. పలు సందర్భాలలో హైపటైటిస్ సి వంటి వ్యాధుల బారిన పడిన వారిలో కూడా ఈ స్థితి ఏర్పడవచ్చు.
కాలేయంలో కొవ్వు పెరగడానికి కారణాలు
ఇప్పటికీ వైద్య పరిభాషలో కాలేయంలో ఎందుకు కొవ్వు పెరుగుతుందనే అంశం పై స్పష్టత లేదు. అయితే కొన్ని సందర్భాలలో ఈ వ్యాధి కారణంగా ఏర్పడే వాపు లేదా మంట అనేది నెమ్మదిగా లివర్ సిరోసిస్ అంటే కాలేయ కండారల క్షీణతకు దారి తీస్తుందని మాత్రం అర్థం చేసుకోగలిగారు. అయితే NAFLD, NASH రెండూ ఊబకాయం, ఇన్సులెన్ రెసిస్టెన్స్ (అంటే మన కణజాలం చక్కెర ను సరిగ్గా గ్రహించకపోవడం అంటే హార్మోన్ ఇన్సులిన్ అందించినా స్పందించకపోవడం) కారణంగా ఏర్పడుతున్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఎక్కువగా రక్తంలో చక్కెర శాతం ఉండడం, టైప్ 2 డయాబెటిస్, ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు పదార్థాలు మన రక్తంలో ఎక్కువగా కనిపించడం వలన కాలేయంలో కొవ్వు పెరుగుతుంది.
ఊబకాయం వలన ఏర్పడుతున్న ఇబ్బందులు
ప్రపంచంలో 1 బిలియన్ ప్రజలు ఎక్కువ బరువు కలిగి ఉన్నారని, అందులో 300 మిలియన్లు ఊబకాయం పరిథిలోకి వస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో NASH అనేది 6 నుంచి 35 శాతం మందిలో గమనిస్తున్నారు. ముఖ్యంగా చైనాలో 5 శాతం, భారత్ లో 5 నుంచి 28 శాతం, జపాన్ లలో 14 శాతంగా ఉందనేనది ఒక అంచనా. ఇక అమెరికా విషయానికొస్తే రక్త పరీక్షల ద్వారా 10-35 శాతం మందిలో ఈ వ్యాధి గుర్తించబడుతుంటే లివర్ బయాప్సీ చేసిన సందర్భాలలో 3 నుంచి 5 శాతం మందిలో ఈ వ్యాధిని గమనిస్తున్నారు. ఇక ఈ వ్యాధి ఏర్పడిన వారిలో జీవన ప్రమాణాలలో ఇబ్బందులు ఏర్పడడాన్ని పలు వైద్య పరిశోధనలు స్పష్టంగా గమనించడమే కాకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
వ్యాధి కారకాలు
ఎక్కువగా కొలెస్ట్రాల్, ఎక్కువ మోతాదులో ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు పదార్థాలు రక్తంలో ఉండడం, ఊబకాయం మరీ అందులోనూ పొత్తి కడుపు ప్రాంతంలో ఎక్కువగా కొవ్వు పేరుకు పోవడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, స్లీవ్ అప్నియా, టైప్ 2 డయాబెటిస్, హైపో థైరాయిడిజం, హైపోపిటుటారిజం వంటివి ఈ వ్యాధికి కారకాలుగా పేర్కొనబడుతున్నాయి. దీంతోపాటు వయస్సు పెరిగిన వారిలోనూ, డయాబెటిస్ ఉన్న వారిలో, కడుపు ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా నమోదైన వారిలో NASH ఎక్కువగా వస్తోంది.
ఫాటీ లివర్ వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి లక్షణాలు సర్వ సాధారణంగా మనకు కనిపించకపోయినా అలసట, పొత్తి కడుపు పై భాగంలో కుడి వైపు నొప్పి లేదా అసౌకర్యం ఉన్నా లేదా పొత్తి కడుపు వాచినా, మన చర్మం క్రింది భాగంలో ఉండే రక్త నాళాలు ఉబ్బినట్లు కనిపించినా, ప్లీహము వాచినా, ఎర్రటి పాదాలు, జాండిస్ లేదా కామెర్ల కారణంగా చర్మం, కళ్లు పచ్చగా మారడం ఈ వ్యాధి లక్షణాలుగా భావించాలి. ఇలాంటి లక్షణాలు సుదీర్ఘ కాలం కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వ్యాధి వలన ఏర్పడే ప్రమాదాలు
ఈ వ్యాధిని ఎక్కువ కాలంగా గుర్తించకుండా వదలి వేస్తే అది కాలేయంలో గాయాలకు అంటే లివర్ సిరోసిస్ కు దారి తీస్తుంది. ఇందుకు ప్రధానంగా కాలేయంలో మంట, వాపు కారణంగా గాయాలకు దారి తీస్తుందని చెప్పవచ్చు. ఈ మంటను తగ్గించుకోవడానికి కాలేయం ఫైబ్రోసిస్ అనే ప్రక్రియకు స్వీకారం చుడుతుంది. ఎక్కువ కాలం మంట కొనసాగే కొద్దీ ఫైబ్రోసిస్ అనేది కాలేయం మొత్తం వ్యాపించడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియకు సరైన సమయంలో అడ్డుకట్ట వేయకపోతే అది కడుపులో అసైటిస్ అనే ద్రవ పదార్థం పేరుకొని పోవడానికి దారి తీసి రక్త నాళాలు దెబ్బ తిని తద్వారా పలు ఇతర ఇబ్బందులు అంటే గందరగోళం ఏర్పడడం, మత్తుగా ఉండడం లేదా మాటలు సరిగ్గా మాట్లాడ లేకపోవడం వంటి పరిస్థితులకు దారి తీయవచ్చు. అప్పటికీ దీనిని గుర్తించకపోతే కాలేయం పూర్తిగా విఫలం చెంది తద్వారా కాలేయం పని చేయడం మాని వేస్తుంది. అయితే సాధారణంగా కేవలం 5 నుండి 12 శాతం మందిలో మాత్రమే ఈ వ్యాధి సిరోసిస్ స్థాయికి చేరుకొంటున్నట్లు పరిశోధనలు తేల్చుతున్నాయి.
చికిత్స
డయాబెటిస్, డైస్లిపిడెమియా, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఊబకాయం వంటి వాటిని నియంత్రణలోనికి తీసుకొని రావడం ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందించడం జరుగుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం కొద్ది మోతాదులో కాఫీ సేవించే వారిలో ఈ వ్యాధి అంత త్వరగా రావడం లేదని కూడా గమనించారు.
నివారణ చర్యలు – తినే తిండిని గమనించుకోవాలి
కరెంట్ సైన్స్ అనే ప్రఖ్యాత జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో నివసించే వారిలో మూడవ వంతు ప్రజలు ఊబకాయంతో బాధపడుతూ ఫాటీ లివర్ రావడానికి అవకాశమున్న వారి జాబితాలో చేరే ప్రమాదం ఉందని తేల్చింది. ఇక చక్కెర వ్యాధి ఉన్న వారు, ఎక్కువగా కొవ్వు పేరుకొని పోయిన వారిలో ఈ వ్యాధి తగ్గిపోతున్న ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాల వలనే వస్తోంది. అందుకే సరైన, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం ద్వారా దీనిని రాకుండా నివారించుకోవచ్చు. దీంతోపాటు మనం తినే ఆహారం పై దృష్టి కేంద్రీకరించి, జంక్ ఫుడ్ తగ్గించి సంపూర్ణమైన, సమతుల్యమైన ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలు అంటే కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకొంటూ బరువు పెరగకుండా చూసుకోవాలి. దీంతోపాటు నియమిత రూపంలో వ్యాయామం అనేది కచ్చితంగా పాటించడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవాలి.
ఇలాంటి పలు చర్యల కారణంగా ఈ వ్యాధి రాకుండా పూర్తిగా నివారించవచ్చు.
– డాక్టర్ అభిరాం కోగంటి
ఎండీ డీఎం, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్
ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్‌పేట, హైదరాబాద్.