ఆధ్యాత్మికం(నమస్తే శేరిలింగంపల్లి): సనాతన ధర్మ బంధువులందరికీ సుపరిచితమైన మహా మృత్యుంజయ మంత్రానికి నిజంగానే ఆయుష్షును పెంచే శక్తి ఉందా…? ఒక మంత్రాన్ని పఠించినంతమాత్రాన చనిపోయే వారిని బ్రతికించగలమా…? ఎంతోమందికి ఈ అనుమానం కలుగక మానదు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో ఇక్కడ చూద్దాం
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
అర్థం: ఓం (హే రక్షకా) సమస్త జీవకోటికి శక్తినిచ్చేవాడు, మూడు కాలాలను చూడగలిగే నేత్రములు కలవాడు, సుగంధ భరితుడు అయిన ఆ పరమాత్మను మేము భక్తితో ప్రార్థించుచున్నాము. మిగల(పూర్తిగా) పండిన దోసపండును తొడిమ నుండి వేరు చేసినట్లుగా మమ్మల్ని జనన మరణ చట్రం నుండి వేరు చేసి అమృత తుల్యమైన మోక్షాన్ని మాకు ప్రసాదించుము.
ఈ మంత్రము ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూక్తంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే “త్ర్యంబక మంత్రము”, “రుద్ర మంత్రము”, “మృత సంజీవని మంత్రము” అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇదే మంత్రం యజుర్వేదం లో సైతం ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.
వేదాలను, పురాణేతిహాసలను నోటితో కాకుండా బుద్ధితో చదవాలనేది ఋషుల సూచన. మంత్రాలను లోతుగా పరిశీలిస్తేనే అందులోని జ్ఞానం మనకు అర్ధమవుతుంది. ఈ మంత్రం అర్థాన్ని పరిశీలిస్తే బాగా పండిపోయిన దోసపండు తీగనుండి విడవడినట్లు మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి మోక్షాన్ని ప్రసాదించుము అని భావం. అంటే మృత్యువును జయించగలిగేది మోక్షం మాత్రమే అనేది స్పష్టమవుతోంది. మరి మోక్షం మనిషి బ్రతికి ఉన్నప్పుడు లభిస్తుందా..? జనన మరణ చక్రం నుండి విడువడటమే మోక్షం కదా..! అంటే ఈ మంత్రం మోక్షాన్ని ఉద్దేశించి మనకు పరమాత్ముడు ప్రసాదించాడని అర్థం చేసుకోవాలి. మరి మోక్షాన్ని ఎలా సాధించాలి..?
ఈ మంత్రంలో దోసపండును ఎందుకు ప్రస్తావించినట్లు…? తీయనైన మామిడి పండునో ఇంకేదైనా పండునో ఉపమేయంగా(పొలికగా) చెప్పవచ్చు కదా. దోసపండు కాయగా ఉన్నప్పుడు తీగతో గట్టిగా పెనవేసుకుని ఉంటుంది( మనిషి ఎలాగైతే కుటుంబ, సామాజిక, ఆర్థిక బంధాలలో ముడిపడి ఉంటాడో) కాయను బలవంతంగా తెంచాలని చూస్తే తీగ మొత్తం పెకళించుకుపోతుంది. అంటే మనిషి యుక్త వయసులో ఉండి అకాల మరణం చెందితే వారి కుటుంబం, బంధువులు, ఇతర సంబంధాలు అన్నీ భంగమై అశాంతికి గురవుతాయి. అదే దోసపండు పూర్తిగా పండిపోయిన తర్వాత మంచి పరిమళాలతో కూడి దానికదే తీగనుండి విడిపోతుంది. అంటే మనిషికి వార్ధక్యం(ముసలితనం) కలిగిన తర్వాత బంధాలు, సంపదపై క్రమేపీ వ్యామోహం తగ్గి భగవంతుణ్ణి చేరాలనే కోరికతో సులువుగా ఈ శరీరాన్ని వదలిపెట్టగలడు. దోసపండు బాగా పండిన తర్వాత సుగంధ పరిమళం ఏవిధంగా వెదజల్లుతుందో, మనిషి కూడా చివరి రోజుల్లో సత్య, ధర్మాచరణ ద్వారా సంపాదించిన పుణ్యముతో అదేవిధంగా అందరి దృష్టిలో మంచి కీర్తిని పొందలనేది మరొక ఉద్దేశం.
సనాతన ధర్మంలో ప్రతి మనిషి నాలుగు ఆశ్రమాలను పాటించాలని వేదం చెబుతోంది. బ్రహ్మచర్యము, గృహస్తము, వానప్రస్తాము, సన్యాసము. బ్రహ్మచర్య, గృహస్త ఆశ్రమలలో వేద జ్ఞానాన్ని సముపార్జించి, సత్యాచారణతో ధర్మబద్ధంగా బ్రతుకుతూ సమాజ, వంశాభివృద్ధికి పాటుపడాలి. వానప్రస్తము అంటే యాబయ్యేళ్ల వయసు వచ్చిన తర్వాత అంటే కొడుకులు, కూతుర్లు ప్రయోజకులైన తర్వాత కుటుంబ బాధ్యతలను వారికి అప్పజెప్పి పరమాత్ముని చేరుకునే పథంలో పయనించాలని వేదం చెబుతోంది. చివరికి సన్యాస ఆశ్రమం చెందిన తర్వాత బంధాలు, వ్యామోహలను పూర్తిగా త్యజించి పరమాత్మునిపై వ్యామోహం పెంచుకుని జీవితాన్ని ఆ పరమాత్మకు సమర్పించి మోక్ష సాధన చేయాలి. అప్పుడే ఈ బంధాల నుండి సులువుగా విడవడటం సాధ్యమవుతుంది.
చావు దగ్గర పడుతున్నా కూడా నా ఆస్తి, నా కుటుంబం అని వెంపర్లాడే వారికి మోక్షం లభించదు, వారు తిరిగి జనన మరణ చక్రంలోనే బందీలుగా ఉండిపోతారు. కొంతమంది జీవితాంతం ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుని, జీవిత అంత్యంలో మోక్షం కోసం వెంపర్లాడటం మూర్ఖత్వమే కదా..! చివరి దశలో ఉన్నవారికి ఈ మంత్రాన్ని వినిపిస్తే తిరిగి బ్రతికే అవకాశం ఉందనేది కొందరి వాదన. కొన్ని చోట్ల ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఆశించిన ఫలితం రాకుంటే ఈ మహా మంత్రంపై అపోహలు ఏర్పడే అవకాశం ఉంది. మంత్రం యొక్క అర్థాన్ని గ్రహించిన విజ్ఞులు సత్యాన్ని గ్రహించి లోకోపకారం చేయాలనేది మా యొక్క ఉద్దేశ్యం.
జీవుడికి గల అపమృత్యు దోషం నుండి రక్షించి, ఏ పరమార్ధంకోసమైతే మానవ జన్మను చేరి, ధర్మబద్ధంగా జీవిస్తూ యేయే ఆశ్రమాలలో నిర్వర్తించవలసిన కర్మలు ఆయా విధముగా పూర్తి చేసి మోక్ష మార్గాన్ని పొందేందుకు కావలసిన శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను కోరే దివ్య మంత్రమే మృత్యుంజయ మంత్రం