శేరిలింగంపల్లి, జూన్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎస్డిఎస్) రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు ఈనెల 9, 10 తేదీల్లో హైదరాబాద్ మియాపూర్ కేంద్రంగా జరగబోతున్నాయని వాటిని విజయవంతం చేయాలని AIFDS రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ ముత్తెన్నగారి శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి మాట్లాడుతూ చదువు పోరాడు సాధించు అనే నినాదంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక విద్యార్థి ఉద్యమాలను నిర్మిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్త విద్యార్థి పోరాటాల్లో భాగంగానే అన్ని జిల్లాల్లో బలమైన నిర్మాణం చేసుకునే దిశగా ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయని అన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పైన చూపుతున్న సవతి తల్లి ప్రేమను ఎండగట్టనున్నామని తెలిపారు.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని, నూతన జాతీయ విద్యా విధానం మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ శాస్త్రీయ విద్యా విధానం కావాలని, ప్రైవేటు యూనివర్సిటీ బిల్లులకు వ్యతిరేకంగా, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దుచేసి కామన్ స్కూల్ విద్యా విధానం తేవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ నిధులు 7800 కోట్ల బకాయి గత మూడు సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు తీవ్ర మనోవేదన చెందుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ లను విడుదల చేయాలని అన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులు వంశీ, దిలీప్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.