దోషాలను నివారించే పితృ పక్షాలు

పితరులు అంటే మన పూర్వికులు. గతించిన పెద్దలకు ప్రతీ యేడు స్మరిస్తూ వారికి చేసే పిండ ప్రధానాలు, తర్పణాలకే శ్రాద్ధ కర్మలని పేరు. పితృ దేవతలను శాంతిపజేయకపోతే ఎన్నో సమస్యలు, బాధలు అనుభవిస్తారు అని చాలామంది విశ్వసిస్తారు. పూర్వం వంశంలో ఎవరో చేసిన తప్పులకు ఆ వంశీకులుగా బాధలు అనుభవించాల్సి వస్తుందని, చనిపోయిన పెద్దలకు సరిగ్గా ఏటా నిర్వహించే కార్యక్రమాల లోపం వల్ల కూడా పలు రకాల సమస్యలు వస్తాయని భావిస్తుంటారు. అయితే వీటన్నింటిని దూరం చేసుకునేందుకు అద్భుత సమయం పితృపక్షాలు లేదా మహాలయ పక్షాల సమయం. భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే రోజులను మహాలయ రోజులు పితృ పక్షాలు అంటారు. చివరి రోజైన అమవాస్యను పితృ అమావాస్య/పెద్దరమాసగా జరుపుకోవడం ఆనవాయితీ.

ఈ రోజుల్లో పెద్దల పేరుతో దానాలు, ధర్మాలు, భోజనాలు పెట్టడం, పేదలకు సహాయం, దేవాలయాలకు వెళ్లడం వంటి పనులు చేయాలి. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయారు. ఈ 15 రోజులు ప్రతి రోజు పితృ దేవతలకు తర్పణం శ్రాద్ధ విధులను నిర్వహించాలి. అలా కుదర కుంటే పితృ దేవతలు ఏ తిధిలో మరణిస్తే ఆ రోజునైనా నిర్వహించాలి. తండ్రి చనిపోయిన రోజున మహాలయ పక్షములలో పితృ తర్పణములు యధావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృ దేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ ధర్మసింధూ, నిర్ణయ దీపికా, నిర్ణయ సింధువు వంటి ధర్మ గ్రంథాలలో పేర్నొనబడ్డాయి.

మహాలయమంటే మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృ దేవతలకిది గొప్ప ఆలయము, పితృ దేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృ దేవతలు తృప్తిని పొందుట అని అర్థములు. అమావాస్య అంతరార్థం అమా అంటే దానితో పాటు, వాస్య అంటే వహించటం. చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితోపాటు కలిసి ఉండే రోజు కాబట్టి అమావాస్య అన్నారు. సూర్యుడు స్వయం చైతన్యవంతుడు. చంద్రుడు జీవుడే. మనస్సుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనస్సు పరమ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది. అదే నిజమైన అమావాస్య. భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండంలో ఉంది.

తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీ, తండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ 17న చేయాలి.

మహాలయ అమావాస్యనాడు ఏం చేయాలంటే…

ఈ పదిహేను రోజుల్లో తిథి, తర్పణ, దానాదులు చేయలేని/అవకాశం లేనివారు కనీసం అమావాస్యనాడు పొద్దునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచితో శుభ్రతతో పెద్దలకు తర్పణం చేయాలి. బ్రాహ్మణులకు పెద్దల పేరుతో సాహిత్యం అంటే భోజన బియ్యం, పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె తదితరాలను దానం చేయాలి. ఆర్థికంగా ఉన్నవారు వస్ర్తాలు, స్వర్ణం, రజితం ఇలా రకరకాల షోడశదానాలు చేయాలి. లేదా ఎవరికి అవకాశం ఉన్నది వారు చేయాలి. కానీ శ్రద్ధ, భక్తి ముఖ్యం. తాతలు, ముత్తాతలు, తాతమ్మలు, నానమ్మలు తదితర పెద్దలందరికి నమస్కారం చేసుకుని నువ్వులతో తర్పణాలు వదలాలి. పేదలకు అన్నం పెట్టాలి. ఇంట్లో వీలుకాకుంటే కనీసం అన్నదానం చేసే దగ్గర ధనరూపంలో అయినా సహాయం చేయాలి. అంతేకాదు ఆ రోజు ఒక్కపూట మాత్రమే భోజనం చేసి రెండో పూట శారీరక పరిస్థితిని బట్టి అల్ఫాహారం లేదా పండ్లు, పాలు తాగి పడుకోవాల. ఇలా చేస్తే తప్పక పితృదేవతల ఆశీర్వాదం లభించడమే కాకుండా తెలియకుండా ఉన్న పితృదోషాలు పోతాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here