శేరిలింగంపల్లి, జూన్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆ దాడిలో అతను ప్రాణాలను కోల్పోయాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలానికి చెందిన మాసన్‌పల్లి రాంచందర్, పసుపు అమరేష్ (23)లు బ్రతుకు దెరువు నిమిత్తం శేరిలింగంపల్లికి వలస వచ్చి స్థానికంగా ర్యాపిడోలో బైక్ టాక్సీలను నడుపుకుంటూ గత వారం రోజులుగా జీవనం సాగిస్తున్నారు. రోజంతా పనిచేసి రాత్రిపూట లింగంపల్లిలోని రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై నిద్రించేవారు. కాగా జూన్ 17వ తేదీన రాత్రి 8.30 గంటలకు ఇద్దరూ స్థానికంగా ఉన్న కల్లు దుకాణం వద్దకు కల్లు సేవించేందుకు వెళ్లారు. అంతలో అక్కడికి వచ్చిన కొందరు మహిళలు, వ్యక్తులు అమరేష్‌పై విచక్షణా రహితంగా, కారణం లేకుండా తీవ్రంగా దాడి చేశారు. అమరేష్ స్పృహ కోల్పోవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై వెంటనే రాంచందర్ పోలీసులకు, అమరేష్ సోదరులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 ఆంబులెన్స్‌ను పిలవగా వారు వచ్చి అమరేష్‌ను పరీక్షించారు. అతను అప్పటికే చనిపోయినట్లు నిర్దారించారు. ఈ క్రమంలో రాంచందర్, అమరేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.