- సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర
నమస్తే శేరిలింగంపల్లి : పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని తెలంగాణ సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టి 14వ రోజు గురువారం హైదరాబాద్ చేరుకున్న వనపర్తి వాస్తవ్యులు చీర్ల కృష్ణ సగర కు సంఘీభావం తెలుపుతూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగరతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఫిలింనగర్ పార్కులో మొక్కలు నాటారు.
వాతావరణ సమతుల్యత కోసం భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్, మంచి నీరు, మంచి ఆహారం అందాలంటే పచ్చని చెట్లు విరివిగా పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా శేఖర్ సగర అభిప్రాయపడ్డారు. ఒకవైపు చెట్లను నరుకుతూ వాతావరణ కాలుష్యం పెరుగుదలకు కారణమవుతున్న మనుషులే భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు తమ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని వెల్లడించారు.
కృష్ణ సగర చేపట్టిన పర్యావరణ అవగాహన పాదయాత్ర కార్యక్రమానికి తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రజా సంఘాలు తీసుకునే ఎలాంటి కార్యక్రమాలకైనా తాము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్రయ్య సగర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణుసగర, ఫిలింనగర్ సగర సంఘం నాయకులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.