శేరిలింగంపల్లిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజెపి

  • ఏడాది కాలంలో అనూహ్యంగా పుంజుకున్న కాషాయ దళం
  • గ్రేటర్ ఎన్నికల్లో గచ్చిబౌలిలో బోణి, మిగిలిన చోట్ల గట్టిపోటి
  • తొమ్మిది చోట్ల ఓడినా పెరిగిన ఓటు బ్యాంకుతో శ్రేణుల్లో ఉత్సాహం

నమస్తే శేరిలింగంపల్లి: ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అని మన పెద్దలు ఏ సందర్భంలో చెప్పారో గానీ ప్ర‌స్థుతం మ‌న శేరిలింగంప‌ల్లి రాజకీయాలకు ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో హవా కొనసాగిన పార్టీలు నేడు చతికిలపడిపోగా, ప్రధాన పార్టీల సహకారంతో ఉనికి కాపాడుకున్న పార్టీలు నేడు తిరుగులేని రాజకీయ శక్తులుగా ఎదిగాయి. టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలు నేడు దాదాపు గల్లంతవ్వ‌గా ఆరేళ్ళ క్రితం ఎలాంటి రాజకీయ బలం లేని టిఆర్ఎస్, బీజేపీలు తొలి రెండు స్థానాల్లో తిష్ట వేశాయి. అనతి కాలంలోనే ప్రజలకు చేరువై, ప్రధాన ప్రతిపక్షంగా మారిన శేరిలింగంపల్లి బీజేపీ ప్రస్థానంపై ప్రత్యేక కథనం…

గల్లంతయిన టీడిపి, కాంగ్రెస్ పార్టీలు.. 
ఒకప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో ప్రధానంగా కాంగ్రెస్, టిడిపిల మ‌ధ్యే పోటీ ఉండేది. 2014 శాసన సభ ఎన్నికల వరకూ ఈ రెండు పార్టీలదే హవా కొనసాగేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 లో జరిగిన సాధారణ శాస‌నసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టిఆర్ఎస్ ప్రభావం కనిపించినా శేరిలింగంపల్లిలో మాత్రం టిడిపి భారీ మెజారిటీ సాధించడం ఈ ప్రాంతంలో ఆ పార్టీ ప్రాభవాన్ని తెలియజేసింది. ఈ సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తు కారణంగా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోగా, టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను దాటి రెండవ స్థానాన్ని సంపాదించింది. 2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని 10 డివిజన్లలో జెండా ఎగురవేసిన టిఆర్ఎస్ అగ్రస్థానాన్ని చేరి టిడిపిని రెండవ స్థానానికి పరిమితం చేసింది. ఈ ఎన్నికల్లో సైతం పొత్తు కారణంగా బీజేపీ గచ్చిబౌలి డివిజన్లో మాత్రమే పోటీ చేసి రెండవ స్థానాన్ని సాధించింది. అనంతరం 2018 శాసనసభ సాధారణ ఎన్నికల్లో సైతం టిఆర్ఎస్, టిడిపి-కాంగ్రెస్ కూటమిల మధ్య మాత్రమే పోటీ కొనసాగినప్పటికీ అనూహ్యంగా తెరపైకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త, మంజీరా సంస్థల అధినేత గజ్జల యోగానంద్ 22 వేల పైచీలుకు ఓట్లు సాధించారు. 2019 చేవెళ్ల లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బి.జనార్దన్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి దాదాపు 50 వేల ఓట్లు పొందాడు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో రెండోసారి మోడీ ప్రభుత్వం కొలువుదీరడంతో శేరిలింగంపల్లి లోని ఆ పార్టీ బలం పుంజుకుంటు వచ్చింది.


జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబిసి మోర్చ జాతీయాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తో శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు

ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలతో ప్రజల్లోకి…
నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్ధాల త‌ర‌ప‌డి పార్టీ కోసం సేవ‌లందిస్తున్న పాత బీజేపీ నేతలతో పాటు, అసెంబ్లిలో పోటిచేసిన‌ గజ్జల యోగా నంద్, టీడిపీ నుంచి కొత్త‌గా పార్టీలో చేరిన‌ మువ్వ సత్యనారాయణలంతా ఏకమై గడిచిన ఏడాది కాలంలో అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టారు. ప్రధానంగా ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా, వరదసాయం వైఫల్యంపై చేసిన పోరాటాలు ప్ర‌జ‌ల్లో బిజెపికి మంచి గుర్తింపును తీసుకువ‌చ్చాయి. అదేవిధంగా దుబ్బాకలో పార్టీ విజయం సైతం శేరిలింగంపల్లిలో జిహెచ్ఎంసి ఎన్నికలపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలోనే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న బీజేపీ అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి చెంది శేరిలింగంపల్లి రాజకీయాల్లో అధికార టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించింది.

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్(పాత చిత్రం)

గచ్చిబౌలిలో గెలుపు.. 9 డివిజన్లలో గణనీయంగా ఓట్లు
తాజాగా జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో శేరిలింగంప‌ల్లిలోని ప‌ది డివిజ‌న్ల‌లో భార‌తీయ జ‌న‌త పార్టీ అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌భ‌రించింది. నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ ధర్మపురి అరవింద్ పర్యవేక్షణ లో నియోజకవర్గ నాయకులు స్థానిక ప్రజలకు కేవలం 15 రోజుల వ్యవధిలోనే చేరువయ్యారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గ‌చ్చిబౌలి డివిజన్ లో 1135 ఓట్ల‌తో విజ‌యం సాధించ‌గా శేరిలింగంప‌ల్లిలో 11468 ,కొండాపూర్ డివిజన్ లో 10772 , హఫీజ్ పేట్ లో 9850 , చందానగర్ లో 8704 , మియాపూర్ లో 7534 , మాదాపూర్ లో 6767 , ఓట్లను సాధించి రెండవ స్థానంలో నిలిచింది. మిగిలిన హైద‌ర్‌న‌గ‌ర్‌, వివేకానంద‌న‌గ‌ర్‌, ఆల్విన్ కాల‌నీల్లోను బిజెపి గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఐతే గ‌చ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే డివిజన్ నుండి దాదాపు 10 మంది ఆశావాహులు పార్టీ టిక్కెట్ ఆశిస్తూ డివిజన్ లో కొంతకాలంగా పార్టీ బలాన్నిమరింత పెంచారు.

బీజేపీ అభ్యర్థి రఘునాథ్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్(పాత చిత్రం)

దానికితోడు స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తి యాద‌వ్‌, ఆయ‌న త‌న‌యుడు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ఎం.ర‌వికుమార్ యాద‌వ్‌లు హ‌స్తంను వీడి కాషాయ తీర్థం పుచ్చుకోవ‌డంతో బిజెపి శిబిరం మ‌రింత బ‌ల‌ప‌డింది. త‌న అనుచ‌రుడైన గోప‌న్‌ప‌ల్లికి చెందిన గంగాధర్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకోవ‌డంలో ర‌వికుమార్ యాద‌వ్ స‌క్సెస్ అయ్యాడు. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులను, డివిజన్ ఎన్నికల ఇన్చార్జి గా రంగంలోకి దిగిన మాజి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ వారంద‌రిని బుజ్జగించి పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేసేలా కృషిచేశారు. దాంతోపాటు తాండూరు, వికారాబాద్ ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో బిజేపి శ్రేణులను రంగంలో దింపగా, ఎన్నికలు దగ్గర పడుతున్న వేల దేశం కోసం ధర్మంకోసం భాజాపాకు ఓటు వేయాలంటు సదరు యువకుల విశేష ప్రాచారం బాగ కలిసొచ్చింది.

గచ్చిబౌలి నుండి గెలుపొందిన గంగాధర్ రెడ్డి ని అభినందిస్తున్న కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబిసి మోర్చ జాతీయాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్

4 వేల నుంచి ఏకంగా 90 వేల పైచీలుకు ఓట్లు సాధించి…
గ‌త జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కేవ‌లం గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో మాత్ర‌మే పోటీచేసిన బిజెపి 4847 ఓట్లు సాధించ‌గా, బిజెపితో పొత్తు పెట్టుకుని మిగిలిన 9 డివిజ‌న్ల‌లో పోటీచేసిన టీడీపీ 72943 ఓట్లు సాధించింది. కాగా కాంగ్రెస్ పార్టీ 27627 ఓట్లు సాధించ‌గా టీఆర్ఎస్ పార్టీ ఒంట‌రిగా పోటి చేసి 1,25,405 ఓట్లు సాధించి మొత్తం 10 డివిజ‌న్ల‌ను కైవ‌సం చేసుకుంది. తాజా ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే టీడీపీ 66272 ఓట్లు త‌గ్గించుకుని 6671 ఓట్ల‌తో స‌రిపెట్టుకోగా, కాంగ్రెస్ 19,517 ఓట్లు త‌గ్గించుకుని 8110 ఓట్ల‌కు ప‌రిమిత‌మ‌య్యింది. ఇక అధికార‌ టీఆర్ఎస్ పార్టీ కేవ‌లం 5828 ఓట్లు, ఒక సిట్టింగ్ సీటు మాత్ర‌మే త‌గ్గించుకుని 1,19,577 ఓట్ల‌తో మొద‌టి వ‌రుస‌లో నిలిచింది.

ఐతే భార‌తీయ జన‌తాపార్టీ మాత్రం గ‌తంతో పోలిస్తే అనూహ్యంగా 85401 ఓట్లు పెంచుకుని మొత్తం 90298 ఓట్ల‌తో టీఆర్ఎస్‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా నిలిచింది. పార్టీల్లో జరిగిన మార్పులను గమనిస్తే ఈ ప్రాంతంలో ఒకప్పుడు బలమైన పార్టీ గా ఉన్న టిడిపి నాయకులు దాదాపుగా ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగా, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ వర్గీయులు, మొవ్వ సత్యనారాయణ అనుచరులు మాత్రమే బీజేపీ లోకి వచ్చారు. టిఆర్ఎస్ పార్టీలో నాయకులు పెరిగినప్పటికీ అందుకు తగినంత ఓటు బ్యాంకు పెరగకపోగా కొద్దీ శాతం ఓట్లను కోల్పోయింది. ఈ విషయంలో మాత్రం బీజేపీ అనూహ్యమైన ఫలితాలనే సాధించింది అని చెప్పవచ్చు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ప్రజలు ఆశలు వదులుకుని, అధికార పక్షాన్ని నిలదీయగలిగే శక్తి కలిగిన ప్రతిపక్షం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీని ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారనే విషయం స్పష్టమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను తనవైపు తిప్పుకోవడంతో పాటు సాధారణ ఓటర్లను సైతం సంపాదించుకున్న బీజేపీ ఇదే రీతిలో విజృంభిస్తే రానున్న ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here