శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానార్ ( సీసీపీ) శ్రీనివాస్ ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, లింక్ రోడ్డుల అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రోడ్లు, లింక్ రోడ్లకు, రోడ్ల విస్తరణ పనులకు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సాంకేతిక ప్రాసెస్ త్వరితగతిన జరిగేలా చూడాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసే విధంగా ప్రజల మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం మరిన్ని లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని, స్థల సేకరణ జరిగి పెండింగ్ లో ఉన్న లింకు రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనికి సీసీపీ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారని, వెంటనే పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు.