సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించుతాం: విజ‌య‌శాంతి

  • బీజేపీ జాతీయ నాయ‌కుల స‌మ‌క్షంలో ఆ పార్టీలో చేరిన రాముల‌మ్మ

ఢిల్లీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాబోయే 2023 ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని గద్దె దించుతామ‌ని బీజేపీ నాయ‌కురాలు, మాజీ ఎంపీ విజ‌యశాంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన విజ‌య‌శాంతి సోమ‌వారం ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయ‌కుల స‌మ‌క్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేవలం త‌న కుటుంబం, త‌న వ‌ర్గం మాత్ర‌మే బాగుప‌డాల‌ని ఎప్పుడూ కోరుకుంటార‌ని ఆరోపించారు. ఉద్య‌మ‌కారులు, ప్ర‌జ‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు.

త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాప‌న‌తో తెలంగాణ ఉద్య‌మాన్ని చేప‌ట్టామ‌ని, తెలంగాణ కోసం తెరాస‌లో పార్టీని విలీనం చేశాన‌ని చెప్పుకొచ్చారు. తెరాస‌లో కేసీఆర్‌తో క‌లిసి ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్ల‌మెంట్‌లో ఎంత‌గానో పోరాటం చేశామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌క‌టించిన వెంట‌నే తన‌ను పార్టీ నుంచి కేసీఆర్ స‌స్పెండ్ చేశార‌ని, కానీ తానే బ‌య‌ట‌కు వెళ్లా‌న‌ని ఆయ‌న ప్ర‌చారం చేశార‌న్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతామ‌న్న తీర్మానం మేర‌కు అప్పుడు కాంగ్రెస్‌లో చేరడం జ‌రిగింద‌న్నారు.

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు లేకుండా చేయాల‌ని సీఎం కేసీఆర్ చూస్తున్నార‌ని, అందులో భాగంగానే కాంగ్రెస్ కూడా పోరాటం చేయ‌డం లేద‌న్నారు. రాష్ట్రంలో తెరాస‌ను ఎదుర్కొనే స‌త్తా బీజేపీకి ఉంద‌ని అందుక‌నే బీజేపీలో చేరుతున్నాన‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ ఎన్నో ఉప‌యోగ‌క‌ర‌మైన అభివృద్ది కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని అన్నారు. 2023లో తెలంగాణ‌లో బీజేపీ క‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు. ప్ర‌జ‌లు దుబ్బాక ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో తెరాస‌కు బుద్ధి చెప్పారన్నారు. సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించుతామ‌ని, వారి అవినీతిని బ‌య‌ట పెడ‌తామ‌ని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సింది పోయి, అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్ష‌స‌, నియంతృత్వ‌, గ‌డీల‌, అవినీతి పాల‌న కొన‌సాగుతుంద‌న్నారు. అమ‌ర‌వీరుల ఆశ‌యాల‌కు భిన్నంగా కేసీఆర్ పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేకత ఉంద‌న్నారు. తెరా కుట్ర‌లు, కుతంత్రాలకు పాల్ప‌డుతుంద‌ని ఆరోపించారు. ఉద్య‌మ‌కారులంద‌రూ ఒక్క తాటిపైకి వ‌స్తున్నార‌ని, తెరాస‌ను ఎదుర్కొనే స‌త్తా బీజేపీకే ఉంద‌న్నారు. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here