- పిలుపునిచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు రేపు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పలువురు కోరారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ తెరాస నాయకుడు కొమిరిశెట్టి సాయిబాబా, సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కమిటీ, నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం నాయకులు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రధాని మోదీ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూస్తున్నారని అన్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదని, ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. మంగళవారం నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.

