నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్, ఓంకార్ నగర్ లో ఇంటింటికీ విద్యుత్ మీటర్లు ఇవ్వాలని కోరుతూ.. ఎంసిపిఐ(యు) నాయకులు హైదర్ నగర్ సెక్షన్ ఏఈ హరి సింగ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత 30 సంవత్సరాలుగా సుభాష్ చంద్రబోస్ నగర్, ఓంకార్ నగర్ విద్యుత్ కష్టాలు పడుతున్నారని తెలిపారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా లేక విషపూరితమైన కీటకాల బారిన పడి ప్రమాదాలకు గురువుతున్నారని చెప్పారు. విద్యార్థులకు చదువు సాగిపోతున్నదని తెలపగా.. ఏఈ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంసిపిఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పల్లె మురళి, దశరథ్ నాయక్ మాట్లాడుతూ బస్తిలలో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులే కావాలని నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, పేద ప్రజల సమస్యలను చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సావిత్రి, సుశీల, పత్తి భాష పాల్గొన్నారు.