శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ రహదారిలో పాదచారుల భద్రతకు నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమస్యలను బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ సిటీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిరుపయోగంగా మారుతున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు లేకపోవటం, కొన్నింటిలో ఎస్కలేటర్లు, లిఫ్ట్ ఉన్నా.. అవి పనిచేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. కొన్నిచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు బస్టాండ్లకి దూరంగా ఉండటం, కొన్నింటిని తాగుబోతులు, భిక్షాటనలకు అడ్డాగా మార్చుకోవడంతో వాటి మీదుగా వెళ్లేందుకు జనాలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.
కొన్ని చోట్ల మెట్లు సరిగ్గా లేక కిందపడతామేమోనని భయంతో వెళ్లేందుకు జనం జంకుతున్నారు అని అన్నారు. ప్రస్తుతం సిటీలో 20కి మించి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఈ ఉన్న కొన్నింటిని కూడా సరిగా మెయింటెయిన్ చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఇది జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమా లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్మమా అని ప్రశ్నించారు. కొన్ని చోట్ల ఎస్కలేటర్లు, లిఫ్ట్ ఉన్నా అవి పని చేయకపోవడంతో మెట్లు ఎక్కి దిగేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో రోడ్డుపై వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉన్నా రిస్క్ చేసి మరీ రోడ్డు దాటే పరిస్థితి ఏర్పడిందని, ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్వహణ చాలా దారుణంగా ఉందని, ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో ముక్కు మూసుకొని నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇకనైనా జీహెచ్ఎంసి అధికారులు, ప్రభుత్వం మేలుకొని ఈ సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్, నవీన్, రంజిత్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.