నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సుపరిచితమైన సంస్థ ఆర్యసమాజం. భారత ఆధ్యాత్మిక భాండాగారాలైన వేదజ్ఞానం మనుష్యులందరికీ చేరవేయాలనే సంకల్పంతో స్వామి దయానంద సరస్వతి ఆర్యసమాజము స్థాపించాడు. సుభాష్‌చంద్రబోస్, లాలా లజపతిరాయ్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు మొదలు పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌బాబ వరకు ఎందరో మహనీయులకు ప్రేరణగా నిలిచిన దయానంద సరస్వతి 198వ జయంతి నేడు.
క్లుప్తంగా ఆయన జీవిత విశేషాలు…
గుజరాత్ రాష్ర్టంలోని ఠంకార అనే గ్రామంలో ఫిబ్రవరి 12, 1824 నాడు ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు దయానంద సరస్వతి. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మూలశంకర్. పరమ శివభక్తుడైన తన తండ్రి ఆచారాలను నిశితంగా గమనించే మూలశంకర్‌కు మహాశివరాత్రినాడు పరమాత్ముడెవరో తెలుసుకోవాలనే ఆలోచన కలిగింది. సనాతన ధర్మంలో దేవుడి పేరిట జరిగే మోసాలు, మూఢనమ్మకాలను రూపుమాపాలని ఇల్లు విడిచి దేశంలోని ఎందరో యోగులు, సాదు సంతుల సాంగత్యంలో జీవితాన్ని గడిపాడు. చివరగా మధురలోని అంధుడైన స్వామి విరజానంద వద్దకు చేరుకుని వేదాలు, ఉపనిషత్తులను సాంగోపాంగంగా నేర్చుకుని దేశమంతా వేదజ్ఞానాన్ని ప్రచారం చేసేందుకు గురువు ఆజ్ఞతో బయలు దేరాడు. దేశాటనలో ఆయా ప్రాంతాల స్థితిగతులను, కులమతాల పేరిట వచ్చిన్నమవుతున్న హిందూ సమాజాన్ని అధ్యయనం చేశాడు. ఒకప్పుడు ధర్మ సంస్కృతులకు కేంద్రమైన భారతావని ప్రస్తుతం అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి బాధపడ్డాడు. అంధ విశ్వాసాలు, అంటరానితనం, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి ‘పాఖండ ఖండిని ‘ అన్న పతాకాన్ని ఆవిష్కరించాడు. హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తాడు. ధర్మ సంస్థాపనకు వేదికగా, భారతావని సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించాడు. మూఢాచారాలను ప్రోత్సహించేవారిని జ్ఞానంతో, తర్కంతో ఓడించి సత్యమైన వేదజ్ఞానాన్ని ప్రచారం చేశాడు. దయానంద సరస్వతిని నేరుగా ఎదుర్కొనే సాహసం చేయలేని కొందరు వ్యక్తులు ఆయనపై పలుమార్లు విషప్రయోగం చేశారు. విష ప్రభావంతో అక్టోబరు 30, 1883 దీపావళి సాయంత్రము స్వామి నిర్యాణం చెందారు.
దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజం నేడు శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వేద ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఆయన సందేశాలతో స్పూర్తి పొందిన ఎందరో జీవితాలను ధర్మపరిరక్షణకు అంకితం చేశారు. దయానంద సరస్వతి జాతికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. భారతదేశంలో సనాతన ధర్మపరిరక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జీవితాన్ని త్యాగం చేసిన దయానంద సరస్వతి హైందవ సమాజానికి సదా స్మరణీయుడే.