శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానాస్పద స్థితిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లి అడ్డగుట్టకు చెందిన బి.అంజయ్య స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమార్తె బి.సుష్మ (27) మాదాపూర్ హైటెక్ సిటీలోని ఇనార్బిట్ మాల్ డి బ్లాక్‌లో ఉన్న డైబోల్డ్, నిక్స్ డార్ఫ్ అనే కంపెనీలో పనిచేస్తోంది. జూన్ 18వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ఎప్పటిలాగే ఆఫీసు పని నిమిత్తం వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అంజయ్య తన కుమార్తె కనిపించడం లేదని మిస్సింగ్ కేసు రిపోర్టు ఇచ్చాడు. కాగా ఆఫీసు నుంచి సుష్మ అదే రోజు రాత్రి 8.30 గంటలకు బయటకు వెళ్లిందని మళ్లీ రాలేదని ఆఫీస్ సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలోనే జూన్ 19వ తేదీన ఉదయం 7 గంటలకు ఓ యువతి మృతదేహం మాదాపూర్ దుర్గం చెరువులో తేలి ఉందని సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన యువతిని సుష్మగా తేల్చారు. ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.