స‌ర్వ‌రోగ నివారిణి.. రేగు పండు..!

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: సాదార‌ణంగా రేగు పళ్ళు అంటే ఒకేసారి కిలోల్లో చూడగలం. తోటల వద్ద గంపల్లో పెద్ద మొత్తంలో చూడవచ్చు. మరి ఎప్పుడైనా టన్నుల కొద్దీ రేగుపళ్ళు చూశారా..? ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే కింది ఆర్టికల్ చదవండి.

డిసెంబర్ నెల ప్రారంభం నుండే ఎక్కడ చూసినా రేగు పళ్ళు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఈ పళ్ళు అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆరోగ్య పరంగా కూడా ఈ పళ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సంక్రాంతి పండక్కి వీటికి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే వీటిని మాములుగా తినడమే కాకుండా ఎన్నో రకాల ఉత్పత్తులు తయారు చేస్తారు.

సంగారెడ్డి నుండి జహీరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై కంకోల్ గ్రామం వద్ద డిసెంబర్ మొదటి వారం నుండే వీటిని టన్నుల కొద్దీ చూడవచ్చు. ఈ గ్రామం సమీప ప్రాంతాలలో వేలాదిగా ఉన్న రేగు చెట్ల నుండి స్థానిక మహిళలు వీటిని ఏరి తెస్తారు. వీటన్నిటినీ కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో సేకరించి లారీల్లో ఆంధ్ర ప్రాంతానికి ఎగుమతి చేస్తారట. వీటితో ప్రధానంగా వడియాలు తయారు చేస్తారని అక్కడి వ్యాపారి ఒకరు వివరించారు.

రేగు పళ్ళ గురించి ప‌లు విశేషాలు…

* రేగు చెట్లు త్వరగా పెరుగుతాయి. మూడు సంవత్సరాల్లోనే పండ్లనిస్తాయి.

* రేగు పండ్లు, వాటి పరిమాణం, రంగు, రుచిని బట్టి సుమారు 90 రకాల‌ దాకా ఉన్నాయి. మనం ఎక్కువగా రెండు రకాలే చూస్తుంటాం.

* రేగు పళ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్‌ మారిటియానా, నార్‌కెలి కల్‌, బెర్‌, బోరీ, బోర్‌, బెరి అని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాలలో పిలుస్తారు.

* ఎండిన పండ్లను స్నాక్స్‌లాగా తింటారు. రేగిపళ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు. రేగు పళ్లతో జ్యూస్‌, వెనిగర్‌లను కూడా తయారుచేస్తారు.

* చైనీయులు వీటితో వైన్‌ను తయారుచేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో, బంగ్లాదేశ్‌లో వీటితో పచ్చడి చేసుకుంటారు.

* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కృష్ణ జిల్లా ప్ర‌జ‌లు రేగుప‌ళ్ళ‌తో వ‌డియాలు చేసుకుంటారు. మ‌చిలిప‌ట్నంలోని ద‌త్తాత్రేయ ఆర్గానిక్ ఫూడ్స్ రేగుప‌ళ్ళ వ‌డియాల‌కు ఫేమ‌స్‌

* రేగుపళ్లలో మంచి పోషకాలే కాక ‘సి’ విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. జామకాయ తరువాత ఎక్కువగా విట‌మిన్ సి ఇందులోనే ఉంటుంది.

* ఇక్కడ దేశంలో ఎక్కువగా వీటిని నేరుగా తింటారు. ప‌లుచోట్ల‌ రేగు తాండ్ర కూడా చేసుకుంటుంటారు.

* వీటి ఆకులు ఒంటెలు, మేకలు, ఇతర పశువులకు మంచి పోషకాహారం. అంతేకాదు ఇండోనేషియన్లు ఆకులతో కూర చేసుకుని తింటారట.

* రేగు పండు హెర్బల్‌ మందుగా పనిచేస్తుంది. కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు రేగు పండ్లతో చేసిన‌ టానిక్‌ను ఎంచుకుంటారు.

* ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. ఇవి విరుగుడుగా, కఫోత్సారకంగా, మూత్ర స్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతాయి.

రేగుప‌ళ్ళ‌తో చేసిన‌ వ‌డియాలు

పురాణాల్లో రేగుప‌ళ్ళ ప్రస్తావన

రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కల ఉన్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించాడు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం అయ్యిందట. బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారట. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో రేగు పండ్ల‌ను పోస్తారు. భారత ఇతిహాసంలో, భారత నాగరికతలో, పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే.

రేగి పండు మీద కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి

* ఈ పండ్ల తియ్యటి వాసనకు టీనేజ్‌ వాళ్లు ప్రేమలో పడతారట.

* అందుకే హిమాలయ, కారకోరమ్‌ ప్రాంతాలలోని పురుషులు స్త్రీలను ఆకర్షిండానికి పూత ఉన్న రేగు కొమ్మను టోపీల మీద పెట్టుకుంటారు.

* అంతేకాదు గర్భధారణ శక్తిని పెంచుతుందని చైనీయులు తమ గదిలో రేగు పండ్లను, ఆక్రోటు కాయలను పెట్టుకుంటారు.

* భూటాన్‌లో సువాసన కోసం రేగుప‌ళ్ళను ఇంట్లో పెట్టుకుంటార‌ట‌. వీటివ‌ల్ల‌ కీటకాలు సైతం లోప‌లికి రావట.

100 గ్రాముల తాజా రేగు పండ్లలో ఉండే పోష‌కాలు…

కార్బో హైడ్రేట్లు – 17 గ్రా.

చక్కెర – 5.4 నుండి 10.5 గ్రా.

కొవ్వు పదార్థం – 0.07 గ్రా.

పీచు పదార్థం – 0.60 గ్రా.

ప్రోటీన్లు – 0.8 గ్రా.

నీరు – 81.6 – 83. 0 గ్రా.

థ‌యామిన్‌ (బి1 విటమిన్‌) – 0.02 నుండి 0.024 మి.గ్రా. (2 శాతం)

రైబోఫ్లేవిన్‌ (బి2) – 0.02 నుండి 0.038 మి.గ్రా. (3 శాతం)

నియాసిన్‌ (బి3) – 0.7 నుండి 0.873 మి.గ్రా. (5 శాతం)

కాల్షియం – 25.6 మి.గ్రా. (3 శాతం)

ఇనుము – 0.76 నుండి 1.8 మి.గ్రా.

ఫాస్పరస్‌ – 26.8 మి.గ్రా.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here