శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కొరకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడేని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడే తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గుడా , నేతాజీ నగర్, రాయదుర్గం, నల్లగండ్ల హుడా కాలనీలలో సీసీ రోడ్లు దెబ్బ తినడం వల్ల చిన్న పాటి వర్షానికి గుంతలలో నీరు నిలిచి స్థానిక ప్రజలు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, తక్షణమే నూతన రోడ్లు వేయించాలని, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జనాభా దృష్ట్యా రోడ్డు వెడల్పు కూడా చేయవలసిన అవసరం ఉందని కార్పొరేటర్ జోనల్ కమిషనర్ ని కోరారు. గచ్చిబౌలి డివిజన్ విస్తారమైన ప్రాంతం కాబట్టి, ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారని, స్థానికుల మౌలిక వసతుల కోసం తగిన నిధులు మంజూరు చేయవలసిందిగా కార్పొరేటర్ జోనల్ కమిషనర్ ని కోరారు. దీనికి జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడే సానుకూలంగా స్పందించారు.