-
ఫేస్‌బుక్ వేదికగా మరో రకం దోపిడీ
నమస్తే శేరిలింగంపల్లి: చాలా రోజుల తర్వాత తనతో పాటు స్కూల్లో చదువుకున్న స్నేహితుడు రామక్రిష్ణ ఫేస్‌బుక్ మెసెంజర్ నుండి సుదర్శన్‌కు మెస్సేజ్ వచ్చింది. ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అని కుశల ప్రశ్నలు అయ్యాక రామక్రిష్ణ తనకు అత్యవసరంగా 10 వేలు అవసరం ఉన్నాయని, ఆసుప్రతిలో ఉన్నానని, రెండురోజుల్లో తిరిగి చెల్లిస్తానంటూ తన స్నేహితుడి నెంబరు పంపి గూగుల్‌పే, ఫోన్‌పే చేయమని అడిగాడు. ఎప్పుడూ లేనిది స్నేహితుడు ఇలా అడగడంతో వెంటనే ఆలోచించకుండా రామక్రిష్ణ పంపిన నెంబరుకు పదివేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు సుదర్శన్. వారం రోజులు గడిచినా స్నేహితుడి డబ్బులు తిరిగి పంపక పోవడంతో మరో స్నేహితుడి వద్ద నుండి రామక్రిష్ణ నెంబరు తీసుకుని ఫోన్ చేయగా సుదర్శన్‌కు షాకింగ్ సమాధానం ఎదురైంది. అసలు తాను ఫేస్ బుక్ లో ఎలాంటి మెసేజ్ పంపలేదని సుదర్శన్ తెలపడంతో ఆశ్చర్యపోయాడు. అసలు విషయంపై ఆరా తీస్తే మెసేజ్ పంపిన అకౌంట్ ఫేక్ అని, తాను మోసపోయినట్లు గ్రహించిన సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇలా మోసగించేస్తున్నారు…
భారతదేశంలో ఓ వైపు సమాచార, బ్యాంకిగ్ వ్యవస్థలు డిజిటలైజ్ అవుతుండగా మరోవైపు సైబర్ నేరగాళ్లు మోసాలకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. చాలామందికి ఆన్‌లైన్ లావాదేవీలపై సరైన అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సులువుగా అమాయకుల అకౌంట్లలోని డబ్బును దోచుకుంటున్నారు. తాజాగా కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్ వేదికగా కొత్త మోసానికి పాల్పడుతున్నారు. వీరు ముందుగా ఎవరైనా ఒక వ్యక్తికి చెందిన ఫేస్ బుక్ వివరాలతో నకిలీ ఖాతాను తయారు చేస్తారు. మన ఖాతాలోని బంధువులు, స్నేహితులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి స్నేహితులుగా చేసుకుంటారు. అనంతరం పైన జరిగిన విధంగా డబ్బులను అడుగుతారు. డబ్బులు అడిగేది తమ స్నేహితులే అని నమ్మే వ్యక్తులు నేరగాళ్లు పంపే ఫోన్ నెంబర్లకు డబ్బులు పంపి మోసపోతున్నారు. నేరగాళ్లు తాము నివసించే రాష్ట్రాలను వదిలి ఇతర రాష్ట్రాల వారిని టార్గెట్ చేస్తుంటారు. జరిగే మోసాలు సైతం చిన్నమొత్తాల్లో ఉండటంతో బాధితులు అధిక వ్యయ ప్రయాసల కారణంగా కేసులను సీరియస్ గా తీసుకోకుండా వదిలేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా పోలీసులు నకిలీ ఖాతాలను సామాజిక మాధ్యమాల నుండి తొలగిస్తున్నారు.
అప్రమత్తతోనే నేరాలను అరికట్టగలం…
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ఆన్‌లైన్ లావాదేవిల పట్ల అప్రమత్తంగా ఉండటంతోనే నేరాలను అరికట్టగలమని పోలీసులు సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా సైబర్ మోసాల నుండి తప్పించుకోవచ్చు.
- సామాజిక మాధ్యమాలలో వీలైనంత వరకూ వ్యక్తిగత సమాచారాన్ని ఉంచకపోవడమే మంచిది.
- మన వివరాలు, ఫోటోలను కేవలం స్నేహితులు, బంధువులు మాత్రమే చూసేలా ప్రైవసీ సెట్టింగులు చేసుకోవాలి.
- మన ప్రమేయం లేకుండా మన వివరాలతో ఏవైనా నకిలీ ఖాతాలు ఉన్నాయో చూసుకోవాలి.
- పరిచయం లేని వ్యక్తులతో ఆన్‌లైన్ లావాదేవిలు చేసేముందు వివరాలు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.
- లక్కీ డ్రాలో డబ్బు గెలుచుకున్నారని క్యూఆర్ కోడ్ పంపేవారు, ఏవైనా సాఫ్ట్ వేర్ లు ఫోన్‌లో ఇన్స్టాల్ చేయమని చెప్పే అపరిచిత వ్యక్తుల మాటలు అస్సలు నమ్మవద్దు.
- బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, ఓటిపి నెంబర్లు, ఖాతా పాస్‌వర్డులు ఎవ్వరికీ తెలియజేయకూడదు.