శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): పేదల నివాస స్థలాలను పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని యం సి పి ఐ (యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ అన్నారు. చందానగర్ జి హెచ్ ఎం సి , రెవెన్యూ, హౌసింగ్ బోర్డ్ అధికారులు మియాపూర్ పరిధిలోని నడిగడ్డ తాండ ఓంకార్ నగర్, ఎం. ఏ నగర్ లలో పేదలు నివసిస్తున్న స్థలాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు నివసిస్తున్న కాలనీలలో ప్రభుత్వం వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో డబుల్ బెడ్ రూములు కట్టించి ఇస్తాము అని మాయ మాటలు చెబుతున్నారని, పేద ప్రజలు నివసిస్తున్న స్థలాలను స్వాధీన పరచుకుని పెద్దలకు అప్పచెప్పటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని అన్నారు. దీన్ని తెలుసుకుని ఆయా బస్తీలలోని ప్రజలు ఆగ్రహించి, వ్యతిరేకించి అధికారులను నిలదీసి తిరగబడి వెల్లగొట్టారన్నారు.
సంవత్సరాల తరబడి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని పేదలు నివసిస్తున్న కాలనీలలో కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేని ఈ అధికారులు, నిజంగా పేదలకు సహాయం చేయాలి అని భావిస్తే ఈ ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం కింద పేదలు నివసిస్తున్న స్థలాలలో ఇండ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల సహాయం ఇచ్చి ఇల్లు కట్టిస్తాం అన్న హామీని అమలు చేయాలని అన్నారు. కాలనీలలో ఉన్న పేద ప్రజల ఇండ్లకు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల చొప్పున ఇచ్చి ఇంటి నంబర్లు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.