శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్‌చెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు శశిధర్ గౌడ్ కుటుంబ సభ్యులను పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. శశిధర్ గౌడ్‌పై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసులను బనాయించిందని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి శశిధర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శశిధర్ గౌడ్ ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నించడం, ప్రభుత్వ వ్యవస్థను విమర్శించడం నేరం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అభిప్రాయ స్వేచ్ఛ ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని, పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు దినేష్ చౌదరి, పాటిమీది జగన్, వై. సతీష్ రెడ్డి, పార్టీ నాయకులు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి, అభిలాష్ రావు, బీఆర్ఎస్ మహిళా నాయకులు శశిధర్ గౌడ్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం దుర్మార్గమని, దీన్ని బీఆర్ఎస్ పార్టీ సహించదని వారు హెచ్చరించారు.