నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్-19 సెకండ్ వేవ్ భారత్‌లో రోజురోజుకూ ఉదృతంగా మారుతోంది. ఏప్రిల్ 4వ తేదీ నాటికి రోజుకు సగటున లక్ష కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా రెండు అంశాలు కేసుల వృద్దికి దోహదం చేస్తున్నాయి. కొద్దికాలం క్రితం తెరవబడిన పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రజా రవాణా ఈ కేసుల పెరుగుదలకు కారణం కావచ్చు. మరోవైపు వైరస్ రెండవ స్ట్రెయిన్ నిరోధక శక్తి పెరగడంతో పాటు బి.1.617 గా పిలవబడుతున్న డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ మొదటి రకం వైరస్‌తో పోల్చితే 70 శాతం అధికంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు కోవిడ్ వ్యాప్తి చెందాకుండా పాటించాల్సిన నియమాలను నిర్లక్ష్యం చేయడమూ కేసుల పెరుగుదలకు మరో కారణంగా తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 2020తో పోల్చితే మరణాల రేటు 3.60 నుండి 1.30 కు తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం. భారత్‌లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రజలు మరో లాక్‌డౌన్ భరించే స్థితిలో లేరు. ఈ కారణంగా ప్రజలు కోవిడ్ కలిగించే నష్టాలను నివారించేందుకు తమ వంతు బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది.
ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో టీకా డ్రైవ్ వేగవంతంగా జరుగుతోంది. ఈ విషయంలో ఇటీవల భారత్ అమెరికాను అధిగమించింది. ప్రతీ ఒక్కరూ వారి వయసు ప్రాధాన్యతలకు అనుగుణంగా టీకాలు వేయించుకోవడం అత్యవసరం. టీకా వేసుకోవడం వల్ల ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చు. దీంతో పాటు ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించడంతో పాటు శానిటైజర్ విధిగా వాడాలి. రద్దీగా ఉండే ప్రాంతాలకు కొంతకాలం వెళ్లకపోవడమే మంచిది. కోవిడ్ సంబంధిత లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితతే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు కొనసాగినప్పటికీ చికిత్స విషయంలో నిర్లక్ష్యం చేయడం ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన మందులు ఉపయోగించడం ద్వారా కోవిడ్ కలిగించే నష్టాల నుండి బయటపడవచ్చు.
అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటైన భారత్ కోవిడ్‌ను అరికట్టేందుకు పాటిస్తున్న విధానాలను ప్రపంచమంతా గమనిస్తూ ఉంది. ప్రతీ పౌరుడు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడటంలో భారత్ తప్పకుండా విజయం సాధిస్తుంది. దీనికి ప్రతీ ఒక్కరి సహకారం ఎంతో అవసరం.
డాక్టర్ పి. కల్పన (B.H.M.S)
Panel doctor for NFC