శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): మతి స్థిమితం లేని ఓ మహిళ ఆశ్రమం నుంచి బయటకు వెళ్లి అదృశ్యం అయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియం సమీపంలో ఉన్న దయా రీహాబిలిటేషన్ ట్రస్ట్‌కు చెందిన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మేరుగు శ్రీవిద్య (30) అనే మహిళకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ క్రమంలోనే ఆమె జూలై 1వ తేదీన రాత్రి 11.40 గంటల సమయంలో ఆశ్రమం నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాలేదు. దీంతో నిర్వాహకులు చుట్టు పక్కల ఆమె ఆచూకీ కోసం గాలించారు. అయినా ఫలితం లేదు. దీంతో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కేఆర్ షాలిని ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎత్తు 5 అడుగులు ఉంటుందని, అదృశ్యం అయిన సమయంలో తెలుపు రంగు స్వెటర్ ధరించి ఉందని, ఆమె తెలుగు, హిందీ భాషలు మాట్లాడుతుందని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.