శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని కొండాపూర్ కేఎంఆర్ ఎస్టేట్స్‌లో నివాసం ఉంటున్న యెల్లంపల్లి నవీన్ (30) స్థానికంగా కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జూలై 2వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో అతను లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు పని నిమిత్తం తన ద్విచక్ర వాహనం (TG35A3370)పై వెళ్తున్నాడు. కాగా మార్గమధ్యలో డోయెన్స్ కాలనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి దురదృష్టవశాత్తూ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలైన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.