మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్

  • మహిళలకు ఎక్కువగా హాని
  • మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?

మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు, మూత్రాశయం, మూత్ర నాళము, మూత్రం వెలుపలికి వచ్చే మార్గము వంటివన్నీ కలిపిన అవయవ వ్యవస్థ.

పురుషుల కన్నా మహిళలలో మూత్ర కోశ మార్గాలలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం ప్రతి ఇరువురు మహిళలలో ఒకరికి తమ జీవిత కాలంలో ఈ ఇన్ఫెక్షన్ సోకుతుందని అంతే గాకుండా ఒకటి కన్నా ఎక్కువ మార్లు ఇది సోకే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇక పురుషుల విషయానికొస్తే ప్రతి పది మందిలో ఒకరికి వారి జీవిత కాలంలో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంతే గాకుండా ఈ ఇన్ఫెక్షన్ ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశ ముంది.

UTI లక్షణాలు

UTI ఏర్పడితే క్రింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి….

• మూత్ర విసర్జన సమయంలో మండుతున్న భావన
• వెంట వెంటనే మూత్ర విసర్జన చేయాలనిపించడం, కానీ మూత్ర విసర్జన చేసే ప్రయత్నం చేస్తే అత్యంత తక్కువ మూత్రం రావడం
• విసర్జించిన మూత్రం నల్లగా, రక్తంతో కలసి లేదా ఒక రకమైన వింత వాసనతో కూడి మబ్బుగా ఉండడం
• చలి లేదా జ్వరం (అంటే ఇన్ఫెక్షన్ మూత్ర పిండాలకు కూడా అంటిందనే సంకేతం)
• వెన్నుముక లేదా పొత్తి కడుపు క్రింద భాగంలో నొప్పి లేదా ఒత్తిడి కలగడం

UTI లో రకాలు

మూత్ర కోశ వ్యవస్థలో ఏ భాగానికైనా ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. అందుకే ఇన్ఫెక్షన్ ఏ భాగానికి వచ్చిందనే దానిపై ఆధారపడి వివిధ రకాలున్నాయి. అవేమిటంటే…

సిస్టిటిస్ (Cystitis) – మూత్రాశం లో ఇన్ఫెక్షన్ ఏర్పడడం. ఎక్కువగా మూత్ర విసర్జ‌న చేయాలనిపించడంతోపాటు చేస్తున్న సమయంలో నొప్పి, భాద కల‌గడం. అలాగే పొత్తి కడుపులో నొప్పి ఉండడంతోపాటు రక్తంతో కూడిన లేదా మబ్బుగా ఉన్న మూత్ర విసర్జన జరుగడం.

పైలోనెఫ్రిటిస్ (Pyelonephritis) – కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం. దీని కారణంగా చలి, జ్వరం, కళ్లు తిరగడం, వాంతులు కావడంతోపాటు పొత్తి కడుపు క్రింద భాగంలో నొప్పి లేదా వీపు వెనుక భాగంలో లేదా ప్రక్క భాగాలలో నొప్పి కలుగుతుంది.

యూరేథరిటిస్ (Urethritis) – మూత్ర విసర్జన నాళంలో ఇన్ఫెక్షన్ రావడం. దీని కారణంగా మూత్ర విసర్జన సమయంలో మండుతున్న భావన వస్తుంది.

UTI లు రావడానికి గల కారణాలు

మహిళలు బాత్ రూం కు వెళ్లిన సమయాలలో ముందు మరియు వెనుక భాగాలలో పూర్తిగా శుభ్రం చేసుకోవాలని వైద్యులు ప్రధానంగా సూచించడానికి కారణం UTI లు వస్తాయనే. ముఖ్యంగా మూత్ర విసర్జన నాళం అనేది మూత్రాన్ని మూత్రాశయం నుండి మన శీరర వెలుపలికి తీసుకొని వచ్చే మార్గం, మలాన్ని శరీరాన్ని నుండి వెలుపలికి పంపే anus లేదా పాయువు కు దగ్గరగానే ఉంటుంది. పలు సందర్భాలలో anus లేదా పాయువు నుండి వచ్చే బాక్టీరియా అంటే పెద్ద ప్రేగు నుండి వెలువడే ఈ కోలి వంటివి అక్కడ నుండి బయటకు వచ్చి మూత్ర విసర్జన మార్గం గుండా ఈ నాళంలోనికి చేరే ప్రమాదం ఉంది. అక్కడ చేరిన తర్వాత దానికి సరైన చికిత్స లభించని సందర్భాలలో అది ముందుగా మూత్రాశయం అటు పిమ్మట మూత్ర పిండాల వరకూ చేరి వాటిని ఇన్ఫెక్షన్ కు గురి చేస్తాయి. మహిళలలో పురుషుల కన్నా చిన్నదైన మూత్రాశయ విసర్జన నాళం ఉండడం వలన వారిలోనికి ఈ ఇన్ఫెక్షన్లు త్వరగా ప్రవేశించడానికి అవకాశ ముంటుంది. ఈ సమయంలో లైంగిక చర్యలో మహిళలు పాల్గొన్న సందర్భంలో ఈ ఇన్ఫెక్షన్ అతి త్వరగా వ్యాపిస్తుంది. అందుకే లైంగిక ప్రక్రియలో చురుకుగా ఉండే మహిళలలో మనం ఎక్కువగా UTI గమనించవచ్చు.

మరి కొందరు మహిళలలో వారి జన్యు పరమైన లోపాల కారణంగా UTI లు ఏర్పడుతుంటాయి. మూత్ర విసర్జన నాళం యొక్క రూపును పట్టి వారు ఇతర మహిళల కన్నా త్వరగా ఇన్ఫెక్షన్ కు గురవుతారు. ఇక డయాబెటిస్ ఉన్న మహిళలలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వారికి కూడా ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. ఇక హార్మోన్లలో వచ్చే మార్పులు, మల్టిపుల్ స్క్లేరోసిస్ మరియు మూత్ర విసర్జనకు ఇబ్బంది కలిగించే అంశాలు అంటే కిడ్నీలలో రాళ్లు, స్ట్రోక్ లేదా వెన్నుముక కు గాయాలు వంటివి కూడా కొన్ని సందర్భాలలో ఈ ఇన్ఫెక్షన్ రావడానికి దోహదం చేస్తాయి.

UTI ని నిర్థారించడానికి చేయవల్సిన పరీక్షలు

ఒక వేళ UTI ఏర్పడిందన్న సందేహం వస్తే వైద్యులు వెంటనే మూత్ర పరీక్ష నిర్వహించి అందులో ఇన్ఫెక్షన్ ఏర్పడడానికి అవసరమైన బాక్టీరియా ఏమైనా ఉందా అని పరీక్షిస్తారు. ఒక వేళ తరచుగా ఈ సమస్య ఏర్పడుతుంటే మొత్తం వ్యవస్థలోనే ఈ ఇన్ఫెక్షన్ ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఎక్కడ ఉంది అని నిర్థారించుకోవడానికి వీలుగా అల్ట్రా సౌండ్ లేదా సిటి స్కాన్ చేసి పరీక్ష చేయడం జరుగుతుంది. పలు సందర్భాలలో సైటో స్కోప్ అనబడే పరికరం సహాయంతో మూత్ర నాళంలోనికి ఒక పైపును ప్రవేశ పెట్టి లోపలి భాగాలను అంటే మూత్రాశయం వంటి వాటిని నిశితంగా పరీక్షించి వ్యాధి నిర్థారణ చేస్తారు.

UTI లకు అందించే చికిత్స

యాంటీ బయాటిక్స్ ను ఇచ్చి UTI లకు సాధారణంగా చికిత్స అందిస్తారు. అదే సందర్భంలో వైద్యులు సూచించిన మేరకు క‌చ్చితంగా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఇన్ఫెక్షన్ తగ్గిందని అనిపించినా వైద్యుల సూచనను పాటిస్తూ మందుల డోసు పూర్తి చేయాలి. అదే సమయంలో ఎక్కువ మోతాదులో నీటిని తాగుతూ శరీరంలోని బాక్టీరియాను వెలుపలికి పంపే ప్రయత్నం చేయాలి. నొప్పిని తగ్గించడానికి కొన్ని సందర్భాలలో మందులు అందించడమే కాకుండా హీటింగ్ పాడ్ ను వినియోగించమని కూడా సూచిస్తారు.

పలు సందర్భాలలో క్రాన్ బెర్రీ పండ్ల రసాన్ని కూడా వైద్యులు ఇన్ఫెక్షన్ తగ్గడానికి వినియోగించమని సూచించవచ్చు. ఈ పండ్లలో ఈ కోలి బాక్టీరియాను నివారించే టానిన్ లు ఉంటాయి. సాధారణంగా ఈ కొలి బాక్టీరియా కారణంగానే ఈ ఇన్ఫెక్షన్ లు ఎక్కువగా వస్తుంటాయి. ఇటీవల కాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇందుకు వ్యాక్సిన్లు తయారు చేయడం ద్వారా ఈ వ్యాధి రాకుండా అరికట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

దీర్ఘకాలిక UTI ప్రమాదం

ఒక సారి ఇన్ఫెక్షన్ వస్తే మరళా మరలా వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి ఐదు మంది మహిళలలో ఒకరికి రెండో సారి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేక పోలేదు. ఇలా వచ్చిన ప్రతి సారి వేర్వేరు రకాల బాక్టీరియా కారణంగా ఇది ఏర్పడవచ్చు. పలు రకాలైన బాక్టీరియాలు యాంటీ బయాటిక్స్ కూడా లొంగకుండా మన శరీరంలో తిష్టవేస్తాయి.

దీర్ఘకాలిక UTI కు చికిత్స

ఒక వేళ వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ సందర్భాలలో ఇన్ఫెక్షన్ వస్తే క్రింద పేర్కొన్న విధంగా వైద్యులు చికిత్స అందించే ప్రయత్నం చేస్తారు.

• తక్కువ పరిణామంలో యాంటీ బయాటిక్ మందులను సుదీర్ఘకాలం అందించడం ద్వారా మరలా మరలా ఇన్ఫెక్షన్ రాకుండా నివారించడం
• లైంగిక చర్యలో పాల్గొన్న ప్రతి సారి యాంటీ బయాటిక్ మందులు వేసుకోమని సూచించడం
• ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించిన ప్రతి సారి యాంటీ బయాటిక్స్ మందులు వేసుకోమని చెప్పడం
• యాంటీ బయాటిక్ కాని పొఫైలక్సిస్ చికిత్స అందించడం

మందులు తీసుకొనే సందర్భాలలో ఒక వేళ ఇన్ఫెక్షన్ తగ్గిందని అనిపించినా, వైద్యుల సూచించిన మేరకు డోస్ పూర్తి చేయాలి.

UTI లు రాకుండా నివారణ చర్యలు

క్రింద పేర్కొన్న కొన్ని చర్యల కారణంగా UTI లు రాకుండా నివారించవచ్చు.

• మూత్ర విసర్జన చేసే సమయంలో మూత్రాన్ని పూర్తిగా విసర్జించే ప్రయత్నం చేయాలి. అంతే కాని త్వరగా ముగించాలనే ప్రయత్నంలో మూత్రాశయాన్ని ఖాళీ చేయకుండా వదుల కూడదు.
• టాయిలెట్ కు వెళ్లిన ప్రతి సారి ముందు, వెనుక భాగాలలో శుభ్రం చేసుకోవాలి
• ఎక్కువగా నీటిని సేవించాలి.
• స్నానానికి షవర్లు ఎక్కువగా వినియోగించాలి.
• మహిళలకు సంబంధించిన శుభ్రతకు వినియోగించే స్ప్రేలు, సువాసన ఇచ్చే డచస్ మరియు బాత్రూం ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
• లైంగిక చర్యలో పాల్గొనే ముందు లైంగిక అవయవాలను శుభ్రం చేసుకోవాలి
• లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత బాక్టీరియా శరీరంలోనికి వెళ్లకుండా మూత్ర విసర్జన చేసి శుభ్రం చేసుకోవాలి.
• లైంగిక చర్యలో పాల్గొనే సమయంలో కండోమ్ లు లేదా ఇతరత్రా గర్భ నిరోధక సాధనాలను వినియోగించిన‌ తర్వాత క‌చ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి బాక్టీరియా ప్రవేశించడానికి దోహద పడుతాయి.
• లైంగిక అవయాలను పరిశుభ్రం చేసుకొంటూ అక్కడ తడి లేకుండా చూసుకోవాలి. అందుకు పూర్తిగా తడి లేని కాటన్ లో దుస్తులు ధరించాలి. అలానే నైలాన్ లో దుస్తులు ధరించడం చేయకూడదు, ఎందుకంటే అవి తేమను ఏర్పరిచి ఇన్ఫెక్షన్ రావడానికి కారణమవుతాయి కాబట్టి.

– డాక్ట‌ర్ వై.రామ సంజ‌య్‌
MBBS,MS, M.Ch, Senior Consultant Urologist
Aster Prime Hospital, Ameerpet, Hyderabad.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here