శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): వైద్య వృత్తి అంటేనే అనుక్షణం సవాళ్లతో కూడుకుని ఉంటుందని స్మిత దంత వైద్యశాల వైద్యుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి అన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీధర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో వైద్య వృత్తి ఎంతో గౌరవ ప్రదమైందని అన్నారు. ఈ వృత్తిలో కొనసాగుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ప్రజలు వైద్యులను దేవుళ్ల కన్నా ఎక్కువగా చూస్తారని తెలిపారు. లాభాపేక్ష లేకుండా వైద్యులు ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకోవాలని అన్నారు. సమాజ హితం కోసం వైద్యులు తమ వంతు బాధ్యతగా పేదలకు సైతం ఉచితంగా వైద్యం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి ఆండ్రూస్, డాక్టర్ రాజేష్ రెడ్డి, కెప్టెన్ రవీంద్ర కుమార్, హెచ్‌సీయూ వీసీ బీజే రావు, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.