- నిఘా వేసి పట్టుకున్న వెస్ట్ జోన్ క్రైమ్ పోలీస్ బృందం
- నిందితుడిపై గతంలోనూ పలు కేసులు నమోదు
- రక్తం ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి
- పూర్తిగా తెలిసిన వారినే తమతమ గ్రూపుల్లో నమోదు చేయాలి
- సోషల్ మాధ్యమాల్లోని గ్రూపుల అడ్మిన్లకు, ప్రజలకు హైదరాబాద్ పోలీసుల సూచన
నమస్తే శేరిలింగంపల్లి: రక్తం & ప్లాస్మా దానం పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి వెస్ట్ జోన్ క్రైమ్ పోలీస్ బృందం చేతికి చిక్కాడు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ నివాసి సందీప్ సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో పలు విధంగా నేరాలకు పాల్పడుతున్నాడు. రక్తం & ప్లాస్మా అత్యవసరంగా కావాలంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెట్టే వారిని లక్ష్యంగా చేసుకుని తక్షణమే ఆ పోస్టింగ్ లోని నంబర్లకు ఫోన్ చేస్తున్నాడు. తాను రక్తం & ప్లాస్మా ఇస్తానంటూ నమ్మించి డబ్బులు వసూలు చేస్తూ ప్లేట్ పిరాయిస్తున్నాడు. కోవిడ్ వ్యాప్తి సమయంలో ఇలాగే పలువురిని మోసం చేసి భారీ ఎత్తున సొమ్ము చేసుకున్నాడు. ఈ తరహా మోసాలకు పాల్పడినందుకు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. కానీ మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తుండటంతో నిందితుడిపై సీసీఎస్ స్పెషల్ జోనల్ వెస్ట్ జోన్ క్రైమ్ టీమ్ ఇన్‌స్పెక్టర్ డి.భిక్షపతి, పీసీలు- విజయ్‌రాజ్ యాదవ్, శ్రీనివాస్, రవీందర్, ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా వేసి 14వ తేదీన పట్టుకున్నారు ఎస్ జెడ్ సిటి (క్రైమ్ టీమ్స్), సీసీఎస్, ఏసీపీ జి. వెంకటేశ్వర రెడ్డి. అనంతరం వివరాలు వెల్లడించారు.
నిందితుల కేసు వివరాలు :
కోవిడ్ వ్యాప్తి చెందుతున్న సమయంలో రక్తం& ప్లాస్మా అందజేస్తానంటూ పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయగా.. పంజాగుట్ట పీఎస్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రూ. 200/- జరిమానాతో 11 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. రెండోవది ఐపీఎస్ 406, 420 కేసు నమోదవగా..రూ. 2 వేల జరిమానతో పాటు 11 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. మూడోది విశాఖపట్నంలోని మహారాణిపేట-2 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా.. 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అంతేకాదు బంజారాహిల్స్, రాంగోపాల్ పేట, ద్వారాక టౌన్ పీఎస్, వైజాగ్ లో కేసులు నమోదయ్యాయి. కానీ మళ్లీ అదే ధోరణి ప్రదర్శింస్తుండడంతో వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి చర్య కోసం దోమల్‌గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రక్తదానం చేస్తామంటూ మోసగించే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. వాట్స్ యాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్ మాద్యమాల్లోని బ్లడ్ డోనర్ గ్రూపుల అడ్మిన్లు తమ తమ గ్రూపుల్లో తెలియని వారి నంబర్లను వారి జోడించవద్దని, ఆ వ్యక్తి పూర్తివివరాలు తెలుసుకున్నాకే గ్రూపులో నమోదు చేయాలని తెలిపారు. తదితర గ్రూపుల్లో ఉండే అపరిచిత వ్యక్తుల వల్ల ఆపదలో ఉన్నవారికి మరింత ప్రమాదం చేకూరే అవకాశం ఉందని చెప్పారు.