దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. గత కొద్ది రోజులుగా అధికార టీఆర్ఎస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలు దుబ్బాకలో గెలిచేందుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. ప్రధానంగా తెరాస, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. అది పలు చోట్ల ముష్టి యుద్ధాలకు దారి తీసింది. ఆ విషయం అలా ఉంచితే ఇప్పుడు పోలింగ్ ముగిసింది కనుక ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి.
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెరాస విజయం సాధిస్తుందని వెల్లడైంది. తెరాసకు 51 నుంచి 54 శాతం ఓట్లు వస్తాయని సమాచారం. 33 నుంచి 36 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేశారు. ఇక పొలిటికల్ ల్యాబొరేటరీ అనే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీదే విజయమని అంచనా వేశారు. బీజేపీకి 47 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. తరువాత తెరాసకు 38 శాతం ఓట్లు వచ్చి ఆ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేశారు.
అయితే దుబ్బాక ఉప ఎన్నికలు ఒక రకంగా సాధారణ ఎన్నికల సమరాన్ని తలపించాయి. ఈ క్రమంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగానే మారింది. నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతాయి.