శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 89.95 లక్షల రేషన్ కార్డుదారులకు,2.81 కోట్ల మంది లబ్ధిదారులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చేందుకు నిరంతరం శ్రామిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని నల్లగండ్ల గ్రామంలోని రేషన్ దుకాణంలో పేదలకు పంపిణీ చేసి జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉగాది సందర్భంగా హుజూర్ నగర్ వేదికగా ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ప్రజాప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందించబోతోందని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న దొడ్డుబియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయడం కోసం రూ.2,800 కోట్లను కేటాయించిందని తెలిపారు.
రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని, ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, కుమార్, ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.