నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన వలయాకారపు సూర్యగ్రహణం సంభవించనుంది. అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి వస్తారన్నమాట. ఈ సమయంలో సూర్యుడు ప్రకాశవంతమైన రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. గ్రహణం గురువారం మధ్యాహ్నం 1గం.ల42 ని.లకు మొదలై సా. 6గం.ల 41 ని.లకు ముగియనుంది. ఈ యేడాదిలో తొలిగా ఏర్పడనున్న ఈ గ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు. భారతదేశంలో గ్రహణ సమయంలో అధికులు కొన్ని పద్దతులను పాటించడంతో పాటు ఆలయాల మూసివేత తదితర కార్యక్రమాలు జరుపుతుంటారు. అయితే గురువారం ఏర్పడనున్న ఈ గ్రహణంపై ప్లానిటరీ సొసైటీ ప్రతినిధులు, పండితులు ఏమంటున్నారంటే…
అపోహలను నమ్మొద్దు…గ్రహణాలు ఆరోగ్యంపై ప్రభావం చూపవు: ప్లానిటరీ సొసైటీ
గురువారం ఏర్పడనున్న గ్రహణ నేపథ్యంలో ప్లానిటరీ సొసైటీ ఇండియా కార్యదర్శి ఎన్.శ్రీ రఘునందన్ కుమార్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ యేడాది మొదటిగా ఏర్పడుతున్న సూర్యగ్రహణం భారతదేశం నుండి చూడలేము. ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆసియా, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల నుండి గ్రహణం కనబడనుంది. మనదేశంలో గ్రహణాలపై అనేక అపోహలు ఉన్నాయి. గర్భిణులు, పుట్టబోయే పిల్లలపై ఎటువంటి గ్రహణ ప్రభావం ఉండదు, గ్రహణమొర్రికి సూర్య చంద్ర గ్రహణాలకు ఎటువంటి సంబంధం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత దేశ వైద్య విభాగపు అధికారులు గ్రహణాలు ప్రమాదకరమైనవని ఏనాడు చెప్పలేదు. ఈ సంవత్సరంలో మే 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది, నవంబరు 19 న పాక్షిక చంద్ర గ్రహణం, డిసెంబరు 4వ తేదీన సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనున్నాయి. సూర్యగ్రహణాలను ఫిల్ములను, నలుపు కంటి అద్దాలను ఉపయోగించి, చంద్రగ్రహణాలను నేరుగా చూడవచ్చు.
పురోహితులు ఏమంటున్నాంటే…
భారతదేశ సనాతన సాంప్రదాయాలలో గ్రహణాలు భాగమై ఉన్నాయి. గ్రహణ సమయంలో వెలువడే కొన్ని కిరణాలు, నెగటివ్ తరంగాల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గర్భిణులు గ్రహణానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ సమయంలో ఏర్పడే దుష్ప్రభావాలను నివారించేందుకు కొన్ని పద్దతులను పాటించాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో వెలువడే కిరణాల ప్రభావాన్ని దర్బలను, గరిక అడ్డుకుంటాయి. ఇది శాస్ర్తీయంగానూ నిరూపితమైంది. గ్రహణం సమయంలో నెగటివ్ రేస్ భూమిపై ప్రభావం చూపిస్తాయి, అందు వలన రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి త్వరగా అనారోగ్యం కలుగుతుంది. ఈ సమయంలో భోజనం చేయడం ద్వారా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ వెలువడే కాస్మిక్ ఎనర్జీ గ్రహణ సమయంలో వెలువడని కారణంగా బ్యాక్టీరియా వైరస్‌లు వృద్ది చెందుతాయి. నెగటివ్ రేస్ వెలువడే సమయంలో మూల విరాట్ క్రింద ఉండే యంత్రాన్ని తాకకూడదనే కారణంగా ఆలయాలను మూసివేస్తారు. అనంతరం నెగటివన్ ఎనర్జీని తొలగించేందుకు సంప్రోక్షణ చేస్తారు. అలాగే మన శరీరాలు కూడ గ్రహణ ప్రభావంతో బాక్టీరియా హాని చేయకూడదని స్నానం చేయాలనీ శాస్త్రాలు తెలియజేసాయి. భారత భూభాగంలో గురువారం గ్రహణం సంభవించని కారణంగా గ్రహణ ప్రభావాలు ఉండవు. ఆలయాల మూసివేత, శాస్ర్త పద్దతులు పాటించాల్సిన అవసరం లేదు.