శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అక్రమించాలని చూడడం సిగ్గుచేటని ఎఐఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ధర్నాకు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి హాజరై రాష్ట్ర కమిటీ తరఫున సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పల్లె మురళి మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం కు వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు జేసీబీని అడ్డుకుంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనను విచ్చిన్నం చేసి అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని, ఆరెస్ట్ చేసిన యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమించుకొని వేలం వేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారుల దాహం తీర్చేందుకే భూముల అమ్మకానికి ముందుకు అడుగులు వేస్తుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమిని ఎరగా చూపి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టుపెట్టే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్తులో యూనివర్సిటీల ఉనికి ప్రమాదకరంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.