హెచ్‌సీయూ భూముల వేలం ఆప‌క‌పోతే ఉద్య‌మం తీవ్ర‌త‌రం: బీజేపీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల‌ను ప‌రిర‌క్షించాల‌ని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు బీజేపీ మ‌ద్ద‌తు తెలిపింది. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని పోలీసులు ముంద‌స్తుగా అరెస్టు చేశారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు, వన్యప్రాణులకు హాని కల్పించే ప్రభుత్వ చర్యలను బిజెపి నిలదీస్తుంద‌ని అన్నారు. ప్రజా పాలన అంటే ప్రభుత్వ భూములను అమ్మడమా అని ప్ర‌శ్నించారు. హామీలు కొండంత అమలు చేయడంలో గోరంత అని ఎద్దేవా చేశారు. యూనివర్సిటిలో పనులు వెంటనే ఆపాల‌ని లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేయాల్సి వస్తుంద‌ని హెచ్చ‌రించారు.

1974 లో 2300 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు ఇవ్వడం జరిగిందని, తరవాతి ప్రభుత్వాలు కొంత భూములను ఐ.ఎస్.బి, ట్రిపుల్ ఐటీ, స్టేడియం, బస్ డిపో, జీహెచ్ఎంసీ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం ఇలా కొన్నిటికి కేటాయించడం జరిగిందని, ఆ తర్వాత 2000 లో ఒక స్పోర్ట్స్ సంస్థకు 400 ఎకరాలు కేటాయించగా వాటిని వారు వినియోగించుకోని పక్షంలో తిరిగి ప్రభుత్వం అధీనం చేసుకుంద‌న్నారు. ఎన్నో సార్లు యూనివర్సిటీ వారు రిజిస్టర్ చేసుకోవాలని చూసినా ప్రభుత్వం నుండి సరైన స్పందన లేక ఆగిపోయిందని, ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఇందిరా గాంధీ కేటాయించిన భూములను యూనివర్సిటీ కి కనీస సమాచారం లేకుండా వేలం వేసేందుకు సిద్ధమ‌య్యార‌ని అన్నారు. యూనివ‌ర్సిటీ భూముల వేలాన్ని ఆప‌క‌పోతే విద్యార్థుల‌తో క‌లిసి ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాయకులు బుచ్చిరెడ్డి, వరప్రసాద్, మారం వెంకట్, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ , సీనియర్ నాయకులు సురేష్, మల్లేష్, మహేష్, అభిషేక్, సాయి మురళి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here