థర్డ్ వేవ్ పేరు వింటేనే తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు కోవిడ్ మూడవ దశ నుండి తప్పించుకునేదెలా..?

ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా యుగం నడుస్తోంది. పోయినేడాది మొదటి దశ పూర్తవ్వగా ఈ సంవత్సరం రెండవ దశ ముగింపుకు చేరుకుందని డాక్టర్లు, సైంటిస్టులు అంటున్నారు. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండవ దశలో వైరస్ వేగవంతంగా దాడి చేయడంతో పాటు ఎంతో మందిని బలి తీసుకుంది. మొదటి దశతో పోల్చితే సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో పాటు చిన్నారుల్లో పాజిటివిటీ రేటు పెరగడం ఆందోళనను కలిగించింది. అయితే మరో ఆరేడు నెలల్లో మూడో దశ కరోనా ఉధృతి పొంచి ఉందని, అది ముఖ్యంగా చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని, వేగంగా వ్యాపించే అవకాశం ఉందనే వార్తలు తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పిల్లలపైనే గంపెడు ఆశలు పెట్టుకుని బ్రతికే తల్లిదండ్రులు ఈ మహమ్మారి నుండి తమ పిల్లలను ఎలా రక్షించుకోవాలో అని తల్లడిల్లిపోతున్నారు. న్యూస్ చానెళ్లు, సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలతో ఏది నిజమో తెలియక అయోమాయనికి గురవుతున్నారు.

ఆది నుండి అన్నీ సందేహాలే…!


కరోనా మహమ్మారి మొదలైన నుండి ప్ర‌జ‌ల మెద‌ల్ల‌లో సందేహాలెన్నో. వైరస్ పుట్టుక ఒక మిస్టరీ అయితే, ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల ఫలితాలు, చికిత్స విధానం మరో మిస్టరీ. ప్రస్తుతం ఏ వ్యాక్సిన్ మంచిది, ఏ సంస్థ వాక్సిన్ బాగా పనిచేస్తుంది అనే అనవసర సందేహాలతో ప్రజలు కుస్తీలు పడుతున్నారు. ఇప్పటిదాకా కోవిడ్ నివారణకు సరైన చికిత్స, మందులు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కోవిడ్ చికిత్సలో ఉపయోగించిన క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న మందులు, చికిత్స పద్ధతులు నేడు దేనికీ పనికి రానివంటూ ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు తేల్చేయడం వైద్య విధానాలపై ఎన్నో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఫావిఫిరవిర్, ప్లాస్మా థెరపీ, రెమ్ డేసివిర్, తాజాగా డాక్సిసైక్లిన్‌, ఐవర్ మెక్టిన్, జింక్ టాబ్లెట్ లు ఈ కోవ లోనివే. స్థిరాయిడ్ల వాడకంపై కూడా ఇప్పటికీ ఎన్నో సందేహాలు. ఇదే మందులకు ఆక్సిజన్, వెంటిలేటర్ లను జోడించి ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలాది రూపాయలు దండుకున్నది జగమెరిగిన సత్యం. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన సగటు మనిషికి కోవిడ్ మూడవ వేవ్ పై జరుగుతున్న ప్రచారాలపై అనుమానం కలుగక మానదు. ఇదంతా మెడికల్ మాఫియా చేస్తున్న బిజినెస్ ప్రచారమే అంటూ జరుగుతున్న ప్రచారాలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

అసలు థర్డ్ వేవ్ అంటే ఏమిటి…వైరస్ దశల వారిగా వ్యాప్తి చెందుతుందా..?


గత ఏడాదిన్నర కాలంగా కోవిడ్ కేసుల సంఖ్యను గ్రాఫ్ చిత్రంలో గమనించినప్పుడు పాజిటివ్ కేసుల హెచ్చు తగ్గులు తరంగాల(వేవ్స్‌) మాదిరిగా కనిపిస్తాయి. ఈ గణాంకాలు వ్యాధి వ్యాప్తిని అంచనా వేసేందుకు దోహదం చేస్తాయి. ఏదైనా వైరస్, బాక్టీరియా బాహ్య వాతావరణంలో మనుగడ సాగించి మనిషి రోగ నిరోధక వ్యవస్థ పై దాడి చేసేందుకు అనుకూలమైన వాతావరణం అవసరం. మన రోగనిరోధక వ్యవస్థలో కాలానికి అనుగుణంగా మార్పులు చోటు చేసుకోవడం సహజమే. అయితే గత రెండు దశలను గమనిస్తే వేసవి కాలంలోనే ఎక్కువ కేసులు నమోదవ్వడం గమనించవచ్చు. అధిక ఊష్ణోగ్రతల్లో వైరస్ బ్రతకలేదని సైంటిస్టులు చెప్పడం గమనార్హం. వైరస్ లు అతి సూక్ష్మజీవులు కావడం చేత వాటి జన్యు ప‌రిణామాలు (మ్యుటేషన్స్) వేగంగా చోటు చేసుకుంటాయి. రోగ నిరోధక వ్యవస్థలను, బాహ్య వాతావరణాన్ని తట్టుకుని మనుగడ సాగించే విధంగా వైరస్ లు రూపాంతరం చెందుతాయి. ఈ కారణంగానే కోవిడ్ ఫస్ట్ వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్ లో వైరస్ లలో ఏర్పడిన మ్యుటేషన్ ల కారణంగా వృద్ధులతో పాటు మధ్య వయస్కుల వారు, యువ‌కులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ అంశాల ఆధారంగానే సైంటిస్టులు మరో ఆరేడు నెలల్లో మూడవ దశ కోవిడ్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మ్యుటేషన్ల కారణంగా వైర‌స్‌ మరింత బలోపేతమై అధిక రోగ నిరోధక శక్తి కలిగిన చిన్నారులకూ ప్రమాదం క‌లిగించే అవ‌కాశం ఉందంటున్నారు వైద్యులు. అయితే కొత్తగా చిన్న పిల్లల్లో అధికంగా నమోదవుతున్న కోవిడ్ కేసులు ఈ వాదనకు బలం చేకూర్చుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్ప‌టికే కోవిడ్ మూడ‌వ‌ద‌శ మొద‌లైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

రెండు దశల్లో చిన్నారులు వైరస్ దాడిని ఎలా తప్పించుకున్నారు..?


సాధారణంగా చిన్న పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ చాలా ఉత్తేజితంగా పని చేస్తుంది. వారి శరీరంలోకి ఏదైనా వైరస్, బాక్టీరియా, ఫంగస్ లు ప్రవేశించిన వెంటనే రో.ని.వ్యవస్థ ప్రతిఘటించేందుకు యాంటీబాడీలను తయారు చేస్తుంది. దీంతోపాటు 15 సం.ల లోపు చిన్నారుల్లో వైరస్ లతో పోరాడే టి.లింఫోసైట్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. అంతే కాకుండా కోవిడ్ వైరస్ ను మన శరీర కణాలకు అతికి ఉంచే ఏసీఈ-2 రిసెప్టార్ ప్రోటీన్ పిల్లల్లో తక్కువగా ఉండటం కూడా మరొక కారణం అయ్యుంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి పిల్లలు ఇండ్లకే పరిమితం కావడం కూడా చిన్నారుల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని మరికొందరు భావిస్తున్నారు. మొద‌టి, రెండ‌వ ద‌శ‌ల్లో వైరస్ పిల్లలకు వ్యాప్తి చెందినప్పటికీ లక్షణాలు లేకుండా, స్వల్ప లక్షణాలతో వేగంగా కోలుకోవడం జరిగింది. పిల్లల్లో మ‌ర‌ణాల రేటు కూడా అతిస్వ‌ల్పంగా న‌మోదైంది. ఈ కార‌ణాల‌తో 18 యేళ్ల‌లోపు ఉన్న వారు సేఫ్ జోన్ లో ఉండ‌టంతో ఆ పై వయసు గ‌ల‌ వారికే ప్రభుత్వం వాక్సిన్ అందజేస్తోంది.

థర్డ్ వేవ్ దాడి నుండి పిల్లలను తప్పించేదెలా..?

థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ పిల్లలపై తీవ్ర దుష్ప్ర‌బావాలు చూపిస్తుంద‌నే వాద‌న‌కు ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినప్పటికీ వైరస్ లో జరిగే మ్యుటేషన్లు అంచనా వేయలేని కారణంగా డాక్టర్లు, సైంటిస్టులు పిల్లల విషయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక పిల్లల విషయంలో తల్లిదండ్రులు అనవసర భయాలకు లోనై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోవిడ్ విషయంలో మనం గమనించాల్సిన విషయం ఇమ్యూనిటీ. రోగం బారిన పడిన తర్వాత చికిత్స అందించేకంటే ముందుగానే నివారించడమే ఉత్తమం అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలి. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉన్న వ్యక్తులు కరోనా బారిన పడినా సులభంగా బయట పడగలిగారు. ఆరోగ్యకరమైన జీవన విధానంతో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ఎటువంటి రోగాలనైనా ఎదుర్కోవచ్చు. కోవిడ్‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొనేలా మీ చిన్నారులను తీర్చిదిద్దేందుకు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి.

 • కోవిడ్ విషయంలో సామాజిక మాధ్య‌మాల‌లో వ‌చ్చే ప్ర‌తీ వార్త‌ను గుడ్డిగా న‌మ్మేసి ఆందోళన చెందకండి
 • వ్యాధి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించండి.
  కోవిడ్ కారణంగా మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఆలస్యంగా చికిత్స తీసుకున్న వారే.
 • పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించండి, రోగ నిరోధక వ్య‌వ‌స్థ‌ను బలపరిచే విటమిన్ సి, డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందించండి.
 • ఆహారంలో లభించని విటమిన్లు, మినరల్స్ లను అవసరమైతే సప్లిమెంట్ల ద్వారా అందించండి.
 • జంక్ ఫుడ్, చిరుతిళ్ల‌ కు వీలైనంత దూరంగా ఉంచండి.
 • అనవసర ఒత్తిడిని దరి చేరనీయకుండా, క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేలా మాన‌సికంగా ధృడ‌ప‌ర‌చండి.
 • ప్రతిరోజూ వ్యాయమం, యోగా చేయండి, పిల్లలతో చేయించండి.
 • ప్రాణాయామం సాధన చేయడం ద్వారా మనసు, శరీరం తేలిక పడుతుంది.
 • కుటుంబ స‌భ్యులందరూ వీలైనంత త్వరగా రెండు డోసుల‌ వాక్సిన్ వేయించుకోండి.
 • ప్ర‌తిరోజూ మాస్క్, శానిటైజర్ ని తప్పక ఉపయోగించండి, సామాజిక దూరం పాటించండి.

కోవిడ్ ఆరంభం మాత్రమే.. భవిష్యత్ లో వచ్చే ఇటువంటి ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు మన కుటుంబాలను శారీరకంగా, మానసికంగా దృఢ పరచుకోవడమే మన ముందు ఉన్న లక్ష్యం.

Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here