- మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
- కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్‌నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి బ్రేక్ పడింది. స్మశానవాటిక గల భూమి వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ స్థానికులు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. కేసు విచారించిన ధర్మాసనం వేలాన్ని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఖానామెట్ పరిధిలోని ఇజ్జత్‌నగర్ సర్వేనెంబరు 41/14 లోని ప్లాట్ నెంబరు 17లోగల దాదాపు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్థానికులు గత మూడు దశాబ్దాలుగా స్మశానవాటికగా ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల హైటెక్ సిటీ సమీపంలోని పలు ప్రభుత్వ భూములను టిఎస్ఐఐసి ఆధ్వర్యంలో వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జివో విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తమ పూర్వీకుల సమాధులు ఉన్న స్మశానవాటిక స్థలాన్ని వేలం వేయకుండా చూడాలని స్థానికులు ప్రభుత్వానికి విన్నవించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు నాయకులు వేలం ఆపాలని కోరుతూ టిఎస్ఐఐసి అధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా ఈ భూముల వేలం శుక్రవారం జరగాల్సి ఉండగా స్థానికులు హైకోర్టులో రిట్ పిటీషన్ 16307/2021 దాఖలు చేశారు. కేసును విచారించిన ధర్మాసనం స్మశానవాటిక ఉన్న స్థలం వేలాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని స్టేటస్ కో ఉత్వర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. స్మశానవాటికను యథాతథంగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.
ప్లాట్ల వేలంతో ప్రభుత్వానికి రూ.729,41 కోట్ల ఆదాయం…
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలం ద్వారా రూ.729.41 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంది. వివాదాస్పదంగా మారిన స్మశానవాటిక స్థలం మినహా మిగితా ఐదు ప్లాట్లను ప్రభుత్వం విక్రయించగా ఎకరం విలువ అత్యధికంగా రూ. 55 కోట్లు పలుకగా అత్యల్పంగా రూ.43.60 కోట్లు పలికింది. ప్లాట్ నెంబరు 4 లోని 3.15 ఎకరాల భూమిని రూ.153.09 కోట్లకు, ప్లాట్ నెంబరు 17లోని రెండు ఎకరాల స్థలాన్ని రూ.46.2 కోట్లకు లింక్‌వెల్ టెలీసిస్టమ్ సంస్థ సొంతం చేసుకుంది. ప్లాట్ నెంబరు 6 లోని 3.15 ఎకరాల భూమిని రూ.137.34 కోట్లకు అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్ సంస్థ చేజిక్కించుకోగా, ప్లాట్ నెంబరు 3.69 ఎకరాల భూమిని రూ.185.98 కోట్లకు జి.వి.పి.ఆర్ ఇంజనీర్స్ సంస్థ కొనుగోలు చేయగా, ప్లాట్ నెంబరు 14 లోని 2.92 ఎకరాల భూమిని రూ.160.60 కోట్లకు మంజీరా కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది.