హేమంత్ హత్య కేసులో 14 మంది రిమాండ్

  • హత్య చేసేందుకు పదిలక్షల రూపాయల డీల్
  • గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య
  • మృతదేహాన్ని పొదల్లో పారవేసిన వైనం
  • పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు
  • మూడు వాహనాలు సీజ్

విలేకరుల సమావేశంలో మాదాపూర్ ఇంచార్జ్ డిసిపి వెంకటేశ్వర్లు

విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న ఇంచార్జ్ డిసిపి వెంకటేశ్వర్లు

మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో పద్నాలుగు మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ ఇంచార్జ్ డిసిపి వెంకటేశ్వర్లు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

చందానగర్‌లో నివాసం ఉండే అవంతి, తారనగర్ కు చెందిన హేమంత్ లు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోరని ఈ ఏడాది జూన్‌ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చందానగర్ పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వగా ఇరు కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు. కౌన్సిలింగ్ తర్వాత హేమంత్, అవంతిలు విడిగా గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా వీరి వివాహాన్ని జీర్ణించుకోలేని అవంతి తల్లిదండ్రులు అర్చన, లక్ష్మారెడ్డి తన బావమరిది యుగంధర్ రెడ్డిలు హేమంత్ ను హత్య చేసేందుకు పథకం వేశారు. పథకంలో భాగంగా యుగంధర్ రెడ్డి తనకు పరిచయం ఉన్న బిక్షుయాదవ్, ఎరుకల కృష్ణ, లడ్డు అలియాస్ మహ్మద్ పాషాలతో హత్య చేసేందుకు పది లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకుని కొంత అడ్వాన్స్ చెల్లించాడు. ఈ క్రమంలోనే గురువారం యుగంధర్ వద్ద పని చేసే సాహెబ్ పటేల్ తన ద్విచక్ర వాహనంపై టీఎన్జీవో కాలనీకి హేమంత్ అవంతి లు ఇంట్లో ఉన్న సమాచారాన్ని అందజేశాడు. వెంటనే యుగంధర్ బిక్షుయాదవ్, ఎరుకల కృష్ణ, లడ్డులతో కలిసి కారులో బయలు దేరారు. వీరి వెంట మరో కారులో అవంతి మామయ్య అద్దం రంజిత్ రెడ్డి ఆయన భార్య స్పందన, చెల్లెలు రజిత, అవంతి బాబాయ్, పిన్నిలు సంతోష్ రెడ్డి, స్వప్న లు వెళ్లారు. మూడో కారులో అవంతి మరో మామ గూడూరు విజయేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, సాహెబ్ పటేల్ లు బయలు దేరి టీఎన్జీవో కాలనీ చేరుకున్నారు. ఇంట్లో ఉన్న అవంతి, హేమంత్ లను బలవంతంగా కారు ఎక్కించి గౌలిదొడ్డి మీదుగా గోపన్ పల్లి చేరుకున్న అనంతరం హేమంత్ ను యుగంధర్ తన కారులోకి ఎక్కించుకుని కొల్లూరు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పైకి వెళ్ళిపోయాడు. విషయం తెలుసుకున్న హేమంత్ తండ్రి మురళీకృష్ణ పోలీసులకు సమాచారం అందించగా గోపన్ పల్లి ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మిగిలిన రెండు కార్లలో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. హేమంత్ ను తీసుకెళ్లిన యుగంధర్ లడ్డు ని దారిలో దించేసి జహీరాబాద్ వైపుగా వెళ్లారు. అక్కడ మద్యం, తాడు తీసుకుని తిరిగి సంగారెడ్డి వైపుగా వస్తూ హేమంత్ కాళ్ళు చేతులు కట్టివేశారు. అనంతరం తాడుతో మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసి సమీపంలోని ఎంజి ఎలైట్ వెంచర్ పొదల్లో హేమంత్ మృతదేహాన్ని పారవేసి తిరిగి వచ్చారు. కేసులో అప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద లభించిన సమాచారంతో పాటు సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా కేసులో ప్రధాన నిందితులతో పాటు సహకరించిన మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసూపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here