అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: తమ కాలనీలో చేపట్టిన యూజీడీ పనులను ఆపకుండా సమస్యను పరిష్కరించాలని వేముకుంట కాలనీ వాసులు పేర్కొన్నారు. యూజీడీ పనులను చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అడ్డుకుంటున్నారని చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. నవత రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మాజీ కార్పోరేటర్ నవత రెడ్డి అడ్డుకోవడం సరికాదన్నారు. వర్షాలకు మురుగు నీరంతా ఇళ్లల్లోకి వస్తుందని అన్నారు. తమ ఇబ్బందుల దృష్ట్యా ఎమ్మెల్యే గాంధీ, స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ప్రత్యేక చొరవతో కోటి రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తే చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వర్షాకాలంలో రోడ్లు తవ్వరాదని జీఓ ఉందంటూ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి కాలనీలో పనులు నిలిపివేయించారన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వేముకుంట కాలనీకి వెళ్లారు.

వేముకుంట కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వేముకుంట కాలనీలో వరద నీరు రహదారులపై చేరడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ తో కలిసి కాలనీలో పర్యటించినట్లు కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తెలిపారు. కాలనీ వాసుల ఇబ్బందుల దృష్ట్యా కోటి రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. కాలనీలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ కార్పొరేటర్ ప్రతి పనికి అడ్డుపడడం సరికాదన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు వ్యవహరించాలే తప్పా ప్రజలకు సమస్యగా మారకుడదని అన్నారు. బిజెపి నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం కాలనీలలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. కాలనీలో చేపట్టిన డ్రైనేజీ పనులు యదావిధిగా జరుగుతాయని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హామీనివ్వడంతో కాలనీ వాసులు శాంతించి ఆందోళనను విరమించారు. ఆమె వెంట టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.

ఆందోళన చేపట్టిన కాలనీవాసులతో మాట్లాడుతున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here