శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళ మెడలో చైన్ దొంగతనానికి పాల్పడిన ఓ యువకున్ని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని ఓల్డ్ ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న పెదపాటి శాంతి లక్ష్మి జూన్ 26వ తేదీన ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటి ముందు ఉన్న చెత్తను శుభ్రం చేస్తుండగా ఓ తెలుపు రంగు హోండా యాక్టివ్ ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసును లాక్కుని ఆమెను తోసి పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితున్ని అరెస్టు చేశారు. శాంతి లక్ష్మి మెడలో చెయిన్‌ను దొంగిలించిన వ్యక్తిని గోపీనగర్‌కు చెందిన కె.సూర్య (19)గా పోలీసులు గుర్తించారు. అతను మదీనాగూడలో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితున్ని పోలీసులు రిమాండ్ కు తరలించారు.