శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను చందానగర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న హరినాథ్ (24), శివాజీ (25) అనే ఇద్దరు వ్యక్తులు పాపిరెడ్డి కాలనీ బ్లాక్ నం.12 వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో వారి నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారు మహారాష్ట్రలోని పర్లి నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.