శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని చందానగర్ లోని శ్రీ విశాఖ శారదా పీఠ పాలిత వేంకటేశ్వర స్వామివారి దేవాలయము ప్రాంగణంలో పాలకమండలి సహకారంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కవి సమ్మేళనాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ సుదర్శన సత్యసాయి జ్యోతి ప్రదీపనము చేసి ప్రారంభించారు. ఈ కవి సమ్మేళనానికి కళాసింధు డాక్టర్ ఆలపాటి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా హాస్య బ్రహ్మ, పాత్రికేయుడు డాక్టర్ శంకరనారాయణ అలాగే అతిథులుగా ఆచార్య బాశెట్టి లత, తెలుగుశాఖ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ, డాక్టర్ ములుగు అంజయ్య శతావధాని, చిత్రకవితా సామ్రాట్ చింతా రామకృష్ణారావు, సంచాలక చక్రవర్తి కటకం వెంకటరామశర్మ, ఆర్కిటిక్ యెండూరి సురేష్ బాబు హజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలను నిర్వహించడం అనాదిగా వస్తున్న సనాతన సాంప్రదాయం. ఉగాది నక్షత్ర గమనానికి ప్రతీక. తన ఊహాశక్తి, కల్పనాశక్తులనే మనో నేత్రాలతో దేనినైన దర్శించి ముగ్ధ మనోహరముగా, సరళంగా, భావయుక్తంగా, వచన, పద్యరూపాలలో వెల్లడించే వాడే కవి. కవి నిత్య నూతన సృష్టి చేస్తూ ఉంటాడు. ఈ వసంత ఋుతువు నిత్య నూతనానికి ప్రతీక. వసంతకాలమున కలిగేటటువంటి సహజసిద్ధమైన, ప్రకృతి పరమైన మార్పులకు అనుగుణంగా నూతన ఉత్తేజంతో ప్రతిక్షణం కవిత్వాన్ని పండిస్తాడు. ఈ వసంతంలో మావిచిగురు తినిన కోయిల ఎలా హృద్యంగా కూస్తూ ఉంటుందో, కవి కూడా నిరంతరము తన రసాత్మకమైన కవితాగానం చేస్తూ అందరినీ ఆనందడోలికలలో ముంచెత్తుతూ హృదయాలను పరవశింప జేస్తుంటాడు అని అన్నారు.
ఈ సందర్భంగా సుప్రసిద్ధులైన కవులు 63 మంది తమ కవితా మాధుర్యాన్ని వినిపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం అతిథులను, కవులను సాంప్రదాయ బద్దంగా వేదమంత్రాలతో శాలువా, పగిడి, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమం ఆర్కిటిక్ యెండూరి సురేష్ బాబు సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజయలక్ష్మి, వాణి సాంబశివరావు, అమ్మయ్య చౌదరి, పాలం శ్రీను, జనార్ధన్, జిల్ మల్లేష్, నండూరి వెంకటేశ్వర రాజు, శివరామకృష్ణ, G.V. రావు, సత్యనారాయణ, భమిడిపాటి, దేవాలయ పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.