శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డి రాజారాం యాదవ్ అధ్యక్షతన సోమవారం జూన్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న యాదవుల ఆత్మగౌరవ సభలో రాష్ట్రవ్యాప్తంగా యాదవ కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రధానంగా యాదవులకు మంత్రివర్గంలో వెంటనే స్థానం కల్పించాలని, యాదవుల జన దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని, రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. యాదవ కార్పొరేషన్ కు పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని, స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో చారీ చేయాలని అన్నారు. ఈ డిమాండ్లను సాధించుకోవాలంటే మనమందరం కలిసికట్టుగా పోరాడాలని ఇందుకు అందరూ ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని అన్నారు.