- రూ.20 లక్షల విలువ గల 30 బైక్‌లు స్వాధీనం
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): గత కొద్ది నెలలుగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యులు ఉన్న ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల విలువ చేసే 30 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీసీ వీసీ సజ్జనార్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రాఘవాపూర్ తండాకు చెందిన పట్లవత్ రాజ్ కుమార్ అలియాస్ రాజు (19) రాజేంద్రనగర్ లోని మైలార్‌దేవపల్లిలో కాటేదాన్ ప్రాంతంలోని బాంబే కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా డెగ్లూర్ ఠానా, వజర్ గ్రామానికి చెందిన ఎస్. రోహిత్ కుమార్ అలియాస్ రోహిత్ (19) కాటేదాన్లోని ఓ బిస్కట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం కంతి బాబుల్ గామ్మకు చెందిన శరణయ్య సాగర్ (22) అత్తాపూర్ లోని ఎన్ఎం గూడలో టిఫిన్ సెంటర్ లో వర్కర్ గా పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. 10వ తరగతి మధ్యలోనే ఆపేశారు. కాగా వీరు మద్యం, గంజాయికి వ్యసనపరులుగా మారారు. దీంతో వీరికి వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. ఈ క్రమంలో వీరు ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీరు మరో నలుగురు బాలురితో కలిసి మొత్తం 7 మంది ఒక ముఠాగా ఏర్పడ్డారు. అనంతరం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అనంతరం గత 4 నెలలుగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేయడం మొదలు పెట్టారు. అనంతరం వాటిని మహారాష్ట్రలోని డెగ్లూర్, నాందేడ్, అనేగావ్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ అనే ప్రాంతంలో ఒక్కో బైక్ ను రూ.15వేల నుంచి రూ.30వేలకు విక్రయించేవారు.
కాగా ఈ ఏడాది జనవరిలో వీరు హైదర్ గూడలోని జనప్రియలో ఎస్ బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలం అయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసుకుని నిందితులను గాలించడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే సీసీటీవీ ఫుటేజ్ లతో పాటు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం నిందితులను పోలీసులు హైదర్ గూడ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేరాలను అంగీకరించారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి రూ.20 లక్షల విలువ గల పలు కంపెనీలకు చెందిన మొత్తం 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రాజ్ కుమార్, రోహిత్ కుమార్, శరణయ్య సాగర్‌లను పోలీసులు రిమాండ్ కు తరలించగా, మరో నలుగురు నిందితులు, మైనర్లు అయిన బాలురను జువైనల్ హోంకు తరలించారు. కాగా నిందితులపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో 22 కేసులు నమోదు కాగా, బంజారాహిల్స్ పీఎస్ లో 3, టప్పాచబుత్రలో 2, కుల్సుంపురలో 1, ఆసిఫ్ నగర్ లో 1, లంగర్ హౌజ్ పీఎస్ లో 1 కేసు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఏసీపీ అశోక్ పాల్గొన్నారు.