- ఓనర్లకు మత్తు మందు ఇచ్చి లూటీ చేయడం వీరి స్పెషాలిటీ
- నిందితుల నుంచి రూ.20 లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవలే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్ గ్యాంగ్ భారీ దోపిడీ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ ఇంట్లో యజమానులకు నమ్మకంగా ఉంటూ వారికి ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి అనంతరం ఆ ఇంట్లోని నగదు, నగలను సదరు గ్యాంగ్ కాజేసి పరారైంది. దీంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
రాయదుర్గం పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ లో గూడూరు మధుసుధన్ రెడ్డి తన భార్య శైలజ, కుమారుడు నితీష్ రెడ్డి, కోడలు దీప్తి, మనుమడు అయాన్ లతో నివసిస్తున్నారు. పదినెలల క్రితం నేపాల్ ప్రాంతానికి చెందిన రవి, అతని చెల్లెలు సీత, మనోజ్, మనోజ్ భార్య జానకి లు మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనికి చేరారు. ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ అనుమానం రాకుండా మెలిగారు. కాగా ఈ నెల 5వ తేదీన జానకి రాత్రి సమయంలో మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఆహారంలో మత్తు మందుకలిపింది. అనంతరం ఆ ఆహారాన్ని అందరూ తిన్నారు. అయితే మధుసూదన్ రెడ్డి భార్య శైలజ ఆహారం తీసుకోలేదు. గ్రీన్ టీ తాగింది. దీంతో ఆమెకు జానకి గ్రీన్ టీలో మత్తు మందు కలిపి ఇచ్చింది. అయితే రుచి మారడంతో శైలజ ఆ టీని ఎక్కువగా తాగలేదు. దీంతో ఆమె పూర్తిగా స్పృహ కోల్పోలేదు. అయితే మిగిలిన అందరూ స్పృహ కోల్పోయే సరికి జానకి, మనోజ్ లు నేత్ర అనే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. అతను మరో ఇద్దరు వ్యక్తులను ఆ ఇంటికి పంపాడు. తరువాత వారు ఇంట్లోకి ప్రవేశించి శైలజా రెడ్డి కళ్లకు గంతలు కట్టారు. అరిస్తే మనవడు అయాన్‌ను చంపేస్తామని బెదిరించారు.
తరువాత వారు ఇంట్లో ఉన్న బంగారం, నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులను కాజేశారు. అనంతరం జానకి, మనోజ్, రవి, సీత, ఇతర వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించారు. మొత్తం రూ.15 లక్షల నగదు, రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. అయితే శైలజా రెడ్డి పూర్తిగా స్పృహ కోల్పోకపోవడంతో రాత్రంతా మెళకువతోనే భయం భయంగా గడిపింది. తెల్లవారు జామున కత్తెర సహాయంతో తన కట్లు విడిపించుకుని చుట్టు పక్కల వారికి విషయాన్ని చెప్పింది. దీంతో వారు ఆమె సోదరి కుమారుడు సూర్య నారాయణ రెడ్డి, ఇతర బంధువులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా మధుసూదన్ రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డ నేత్ర బహదూర్ షాహి, అతని స్నేహితులు, ఇతర వ్యక్తులు ఓ ముఠా అని పోలీసులు గుర్తించారు. వారు హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ధనవంతుల ఇండ్లలో పనిలో చేరుతారు. అదును చూసి ఓనర్ల ఆహారంలో మత్తు మందు కలిపి వారు స్పృహ తప్పగానే ఇంట్లో ఉండే నగలు, నగదును దోచుకెళ్తారు. ఈ క్రమంలో వారు దోపిడీ చేసిన అనంతరం భిన్న మార్గాల్లో నేపాల్‌కు చేరుకుంటారు.
ఇక రాయదుర్గం చోరీ కేసులో పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసుల సహాయం కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిందితులను ఎట్టకేలకు పట్టుకుని అరెస్టు చేశారు. నేపాల్ కు చెందిన నేత్ర బహదూర్ షాహి అలియాస్ నేత్ర (40), ప్రకాష్ షాహి అలియాస్ ప్రతాప్ (39), సీతా లావర్ (25)లను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు రాజేందర్ అలియాస్ రవి (28), దేవీ రాం దమ్లా అలియాస్ దీపక్ (31), జానకి, వినోద్ కమల్ షాహి (30), భోజల్ బీకా, మనోజ్ బహదూర్ షాహి (27)లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు.
ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేసిన అనంతరం పోలీసులు వారి నుంచి రూ.5.2 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం మొత్తం కలిపి రూ.20 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల్లో కొందరిపై గతంలో నార్సింగి పీఎస్‌లోనూ ఓ కేసు నమోదైంది.
ఇక నిందితులను పట్టుకోవడంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్ రావు, ఎస్‌వోటీ అడిషనల్ డీసీపీ సందీప్, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ సుధీర్, నార్సింగి పీఎస్ డీఐ బాలరాజు, మాదాపూర్ ఎస్‌వోటీ ఎస్ఐలు లాల్ మదర్, విజయ్, హరిశంకర్ లను సీపీ సజ్జనార్ అభినందించారు.