శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): జల్సాలకు అలవాటు పడి పదే పదే దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్తున్న ఓ యువకుడు తిరిగి అదే పని చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని యూసుఫ్‌గూడ కార్మికనగర్‌లో నివాసం ఉంటున్న రాపనోళ్ల మహేష్ (21) పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే జల్సాలకు అలవాటు పడడంతో మహేష్ గతంలో పలు మార్లు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభించి కూడా వచ్చాడు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే అతను తాజాగా మియాపూర్‌లోని ఆదిత్య నగర్‌లో ఎండీ ఆసిఫ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడగా ఆసిఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.