- సైబర్ నేరగాళ్లను పట్టుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
- అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): వాట్సాప్‌లో ఒక వ్యక్తిని అతని సోదరుడిగా నమ్మించి ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. బాధితుడి నుంచి రూ.2 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీడిమెట్లలోని పేట్‌బషీరాబాద్‌లో నివాసం ఉండే బాలముకుంద్ నామ్‌దేవ్ కు ఈ నెల 3వ తేదీన ఒక నంబర్ నుంచి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. అమెరికాలో ఉండే తన సోదరుడు మహేందర్ కుమార్ నామ్‌దేవ్ పేరిట ఆ మెసేజ్ వచ్చింది. తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని ఆ మెసేజ్‌లో ఉంది. ఇక సదరు వాట్సాప్ మెసేజ్ పంపిన ఫోన్ నంబర్ కూడా అమెరికా ఫోన్ నంబర్‌ను పోలి ఉంది. అలాగే వాట్సాప్ అకౌంట్‌కు మహేందర్ కుమార్ ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టారు. దీంతో బాలముకుంద్ ఆ మెసేజ్‌ను నిజంగా తన సోదరుడు మహేందర్ పంపించాడని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ మెసేజ్ లో చెప్పినట్లు బాలముకుంద్ రూ.2 లక్షలను అందులో ఇచ్చిన ఓ అకౌంట్‌కు పంపించాడు. తరువాత అమెరికాలో ఉన్న తన సోదరుడు మహేందర్‌కు కాల్ చేసి డబ్బులు పంపినట్లు చెప్పగా, తాను డబ్బులు కావాలని అడగలేదని తెలిపాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాలముకుంద్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఈ నెల 5వ తేదీన ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం వెతికారు.
కాగా బాలముకుంద్ సోదరుడికి చెందిన ఫొటోను సేకరించి అతని సోదరుడిగా నటిస్తూ ఇద్దరు వ్యక్తులు అతని నుంచి డబ్బు కాజేశారని పోలీసులు గుర్తించారు. వారిని ముంబైకి చెందిన దీపక్ నందియాల్ సిధ్‌పుర (42), మనీష్ అమృత్‌లాల్ రాజ్‌పోపట్ (42) గుర్తించారు. వారిని ముంబైలో ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు వారిని విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వారి నుంచి రెండు ఐఫోన్లు, దీపక్ పాన్ కార్డు, చెక్ బుక్, అమృతలాల్ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ కె.బాలకృష్ణారెడ్డి, క్రైమ్స్ డీసీపీ పి.రోహిణి ప్రియదర్శినిల పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేష్, ఎస్ఐపీ ఎస్.రాజేందర్, సిబ్బంది ఈ కేసులో నిందితులను పట్టుకున్నారు.
రోజు రోజుకీ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు.
* సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయరాదు.
* అపరిచితులకు ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఇతర ముఖ్యమైన సమాచారం చెప్పకూడదు.
* ఎవరితోనూ వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయరాదు.
* విదేశీ నంబర్లు +1, +968, +44 నుంచి వచ్చే కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లకు స్పందించకూడదు.
* తెలియని వ్యక్తులకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు డబ్బు పంపకూడదు.
* తెలియని వ్యక్తులు పంపిన మెసేజ్‌లలో ఉండే లింక్‌లను క్లిక్ చేయరాదు.
* అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
* వాట్సాప్ కాల్ లేదా చాట్, ఫేస్‌బుక్ కాల్ లేదా చాట్ ద్వారా ఎవరైనా డబ్బు పంపాలని అడిగితే స్పందించకూడదు.