నమస్తే శేరిలింగంపల్లి: జలవనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో జలమండలి అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జలమండలి అధికారులు, స్థానికులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిపై ఉన్న నీటిలో 97 శాతం తాగడానికి పనికి రాని నీరు ఉంటే మిగతా రెండు శాతం మంచు పర్వతాలలో గడ్డ కట్టుకొని ఉందని, ఒక్క శాతం నీటిని మాత్రమే ప్రజలు వాడుకోవడానికి అనువుగా భూగర్భంలో దాగి ఉందన్నారు.భూగర్భ జలాలను పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, నీటిని మోతాదుగా వాడుకుని పొదుపు చేసుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ శంకర్, వాటర్ వర్క్స్ ఏజీఎం నాగప్రియ, మేనేజర్లు సాయి చరిత, సునీత, వర్క్ ఇన్ స్పెక్టర్లు జె రమేష్, కిష్టప్ప, జలమండలి సిబ్బంది, కాలనీ అధ్యక్షులు రాజు, రామాంజనేయ రెడ్డి, రాఘవ రావు, అశోక్, రవి, వెంకట్ రెడ్డి, కృష్ణ మూర్తి, సీత కుమారి, అనిత, తదితరులు పాల్గొన్నారు.