శేరిలింగంపల్లిలో వేగంపుంజుకున్న టిఆర్ఎస్ రేసుగుర్రాల ఎంపిక ప్రక్రియ

  • జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్న స్థానిక పెద్దలు
  • మూడు డివిజన్ల ఆశావహులతో విడివిడిగా చర్చలు…?

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ మరోసారి విజయం అందిపుచ్చుకునే దిశగా పకడ్బందీగా పావులు కదుపుతోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా శేరిలింగంపల్లిలోని అన్ని వార్డుల నుండి అధికార పార్టీకి వలసలు భారీగా పెరిగాయి. ఫలితంగా అధికార టిఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్లకు పోటీగా టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య ఇతర పార్టీలతో పోల్చితే గణనీయంగా పెరిగింది. గతంలో ఓ సమావేశంలో మంత్రి కేటీఆర్ పలువురు కార్పొరేటర్ల పనితీరుపై అసహనం వ్యక్తం చేయడంతో వచ్చే ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు ఉద్వాసన పలుకుతారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో కొత్తగా టికెట్ ఆశిస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. అయితే తాజాగా సిట్టింగులకే తొలిప్రాధాన్యత ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

పెరిగిన ఆశావహులు.. నేతల ముందస్తు వ్యూహాలు..

శేరిలింగంపల్లి టిఆర్ఎస్ లో ఆశావహుల సంఖ్య పెరగడంతో స్థానిక పెద్దలు భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ఆశిస్తున్న వారందరితో సామరస్యంగా చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు చేజారిపోకుండా ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు స్థానిక టిఆర్ఎస్ నేతలు. నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ డివిజన్లకు చెందిన ఆశావహులతో ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావులు సోమవారం ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. ఈ సమావేశంలో టికెట్ ఆశిస్తున్న వారిని ఒక్కొక్కరిగా కలిసి వారికి గల అర్హతలు, బలాబలాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యరులందరూ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా, అవకాశం ఇచ్చిన వారికీ మిగిలిన నాయకులందరూ సహకరించే విధంగా ఆయా డివిజన్ల నాయకులను ఏకత్రాటిపైకి తీసుకువచ్చేందుకు నేతల బృందం ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన డివిజన్లలో సైతం ఇదే తరహాలో ఆశావహులతో చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

టిఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలు ఫలించేనా…?

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికతో పాటు అనంతరం భంగపాటుకు గురయ్యే క్యాడర్ ను కాపాడుకునే పనులు టిఆర్ఎస్ అధినాయకత్వానికి పెద్ద సవాల్ గా మారనున్నాయి. పార్టీ నుండి టికెట్ ఆశించినప్పటికీ అవకాశం లభించకపోతే స్వతంత్రంగానో, ఇతర పార్టీలనుండైనా పోటీ చేసే యోచనలో పలువురు ఆశావహులు ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన నాయకులు ఈ ఎన్నికల సమయానికి అధికార పార్టీలో టికెట్ రేసులో నిలుస్తుండటం గమనార్హం. ఇతర పార్టీల నుండి పదవులు ఆశించి టిఆర్ఎస్ లో చేరిన నాయకులు టికెట్ లభించకపోతే తిరిగి సొంత గూటికి చేరే అవకాశాలూ లేకపోలేవు. ఇటువంటి పరిస్థితుల్లో శేరిలింగంపల్లి టిఆర్ఎస్ పెద్దల వ్యూహాలు ఎంతవరకు ఫలితాలిస్తాయో వేచి చూడాల్సిందే.

Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here