గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): రాయదుర్గంలో ఓ ఇంటి యజమాని సహా అతని కుటుంబం మొత్తానికి మత్తు మందు ఇచ్చి వారి ఇంట్లోని నగలు, నగదును నేపాలీ గ్యాంగ్ దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఆ కేసులో పలువురిని సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే సదరు గ్యాంగ్ పాల్పడిన దోపిడీ నేపథ్యంలో నగర ప్రజలకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పలు సూచనలు చేశారు. అవేమిటంటే…
* ఇంట్లో పని మనుషులను పెట్టుకునే ముందు వారి ఐడీ ప్రూఫ్‌లను తీసుకుని అవి నిజమా కాదా, వారి వివరాలు ఏమిటో పక్కాగా తెలుసుకోవాలి.
* వారు అంతకు ముందు ఎక్కడైనా పనిచేశారో, లేదో తెలుసుకోవాలి. వారి ఫోన్ నంబర్ తీసుకోవాలి.
* ఇంట్లో మీరు లేనప్పుడు మీ ఇంట్లోని పనిమనుషులు ఏం చేస్తున్నారు అనే విషయాలను గమనించాలి. వారిపై ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి.
* వారి పేరు మీద ఏవైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, లేదా, వారి చరిత్ర ఏమిటి ? అన్న వివరాలను తెలుసుకోవాలి.
* మీ ఇంట్లో పనిచేసేందుకు వారికి అర్హత ఉందా, లేదా అన్న విషయాలను గమనించి మరీ పనిలో పెట్టుకోవాలి. అవసరం అయితే కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకోవాలి.
* మీ ఇంట్లోని పనిమనుషులతో తరచూ మాట్లాడేవారి వివరాలను అడిగి తెలుసుకోవాలి.
* ఇంట్లో విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు.
* ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయన్న సమాచారం పనివారికి తెలియకుండా చూసుకోవాలి. ఆ విషయాలు వారి ఎదుట మాట్లాడకూడదు.
* ఇంట్లోని పనివారి మీదే ఎక్కువగా ఆధారపడకూడదు.
* ఇత్తడితో తయారు చేసిన లాక్‌లకు బదులుగా స్టీల్‌తో తయారు చేసిన లాక్‌లను ఉపయోగించాలి.
* ఇంట్లో, చుట్టు పక్కల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ రూంలలో తప్ప అన్ని ఏరియాల్లో సీసీ కెమెరాలు ఎప్పుడూ నిఘా ఉంచేలా చూసుకోవాలి.
* ఆభరణాలు, నగదును లాకర్‌లో పెట్టడం మంచిది.
* ఇంటిని వదిలి కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. లేదా బ్యాంక్ లాకర్లలో పెట్టుకోవాలి.
* ఇంటిని వదిలి బయటకు వెళితే ఇరుగు పొరుగున ఉన్నవారికి ఆ విషయం చెప్పి ఇంటిని పరిశీలిస్తూ ఉండమని చెప్పాలి.
* ఇంట్లో గదులను ఎవరికైనా అద్దెకు ఇస్తే వారి ఐడీ ప్రూఫ్‌లు, ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. వారి గదులకు ఎవరెవరు వస్తున్నారు అనే విషయాలను గమనించాలి.
* ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
* ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ఆ వివరాలను సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఇతరులకు చెప్పకూడదు.
* ఇంట్లోకి అపరిచిత వ్యక్తులను రానివ్వకూడదు. బయట ఉంచే మాట్లాడాలి.