శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ బంగారు వ్యాపారి పోగొట్టుకున్న నగదు బ్యాగును తిరిగి అతనికి అప్పగించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తన నిజాయితీని చాటుకున్నాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో మియాపూర్ ఆల్విన్ చౌరస్తా జంక్షన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌పీసీ 8749 రాజేష్‌కు రూ.500 నోట్లు కలిగిన ఓ బ్యాగు లభ్యమైంది. అందులో రూ.1.50 లక్షల నగదు ఉంది. ఈ క్రమంలోనే తన బ్యాగు పోయిందంటూ జి.మధుసూదన్ రావు అనే బంగారం వ్యాపారి మియాపూర్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఓ కస్టమర్ నుంచి తెస్తున్న నగదును ఆ బ్యాగులో పెట్టానని, అది దారిలో జారిపోయిందని తెలిపాడు. దీంతో అతను చెబుతున్న సమాచారం నిజమా, కాదా అని విచారించిన పోలీసులు అతను నిజమే చెబుతున్నాడని గుర్తించి ఆ బ్యాగును అతనికి అందజేశారు. ఈ మేరకు కానిస్టేబుల్ రాజేష్ ఆ బ్యాగును మధుసూదన్ రావుకు అప్పగించాడు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు రాజేష్ నిజాయితీని అభినందించారు.